డివైడర్‎ను ఢీకొట్టి తుక్కు తుక్కైన మహీంద్రా థార్.. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు స్పాట్ డెడ్

డివైడర్‎ను ఢీకొట్టి తుక్కు తుక్కైన మహీంద్రా థార్.. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు స్పాట్ డెడ్

ఛండీఘర్: అతివేగంగా దూసుకెళ్లిన మహీంద్రా థార్ అదుపు తప్పి డివైడర్‎ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వీరంతా 30 ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం. ఈ విషాద ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‎లో జరిగింది. 

పోలీసుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‎కు చెందిన ప్రతిభా మిశ్రా (25), ఆదిత్య ప్రతాప్ సింగ్ (30), గౌతమ్ (30), లావణ్య (26), సోని (26), కపిల్ శర్మ (28) పని నిమిత్తం హర్యానాలోని గురుగ్రామ్‎కు వెళ్లారు. ఆరుగురు మహీంద్రా థార్ కారులోనే వెళ్లారు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేలోని ఎగ్జిట్ 9 దగ్గర వీరు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదానికి గురైంది. 

డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయి నేరుగా డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో కారులోని ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు పురుషులు సహా ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. మృతులను ప్రతిభా మిశ్రా, ఆదిత్య ప్రతాప్ సింగ్, గౌతమ్, లావణ్య, సోనిగా గుర్తించారు పోలీసులు.

గాయపడిన కపిల్ శర్మను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ప్రతిభా సింగ్ జడ్జి కుమార్తె. కూతురు చనిపోవడంతో జడ్జి ఫ్యామిలీ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఓవర్ స్పీడ్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. ప్రమాదంలో మహీంద్రా థార్ నుజ్జు నుజ్జు కావడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది.