విద్యా రంగానికి ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విద్యా రంగానికి ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేస్తం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఇందిరా మహిళా డెయిరీని ఆదర్శంగా తీర్చిదిద్దాలి
  • అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం
  • ఇందిరా మహిళా డెయిరీ, విద్య, వైద్య శాఖలపై రివ్యూ

ముదిగొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగానికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గురువారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గాంధీజీరిలో జిల్లా కలెక్టర్  అనుదీప్  దురిశెట్టి, పోలీస్  కమిషనర్ సునీల్ దత్ తో కలిసి ఇందిరా మహిళా డెయిరీ, విద్య, వైద్య శాఖల అధికారులతో మంత్రి రివ్యూ నిర్వహించారు. ఆయన  మాట్లాడుతూ.. మధిర నియోజకవర్గంలో బడుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మండలానికి మూడు పాఠశాలలను ఎంపిక చేసి 800 వందల మంది విద్యార్థులకు సరిపోయేలా ప్రైవేటు పాఠశాలలకు మించి వసతులను ఏర్పాటు చేయాలని సూచించారు. ‘‘విద్యార్థులకు ఉదయం బ్రేక్ ఫాస్ట్, మధ్యాహ్నం భోజనంతో పాటు బడికి వచ్చేందుకు రవాణా సౌకర్యం కల్పించాలి. 

బోనకల్  మండలం లక్ష్మీపురంలో నిర్మిస్తున్న యంగ్  ఇండియా ఇంటిగ్రేటెడ్  రెసిడెన్షియల్  పాఠశాల భవన నిర్మాణాన్ని వచ్చే విద్యా సంవత్సరం నాటికి  పూర్తి చేయాలి. మధిర ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేసి పరికరాలను కొనుగోలు చేసి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలి. చింతకాని నర్సింగ్  కాలేజీకి ప్రతిపాదనలు సమర్పించాలి’’ అని భట్టి పేర్కొన్నారు. వైరా ఆసుపత్రికి సంబంధించి నిధుల మంజూరుకు చర్యలు చేపట్టామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇందిరమ్మ మహిళా డెయిరీలో మొదటి విడతగా గేదెల సేకరణ చేశామని, రెండో విడత కింద  125  మంది బీసీ లబ్ధిదారుల ఎంపిక చేసి గేదెల సేకరణ చేపట్టాలని ఆదేశించారు.  ప్రతి గేదెకు షెడ్డు ఉండాలని, ఆ షెడ్ పై సోలార్  ప్యానెల్ ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పశు వైద్యశాలల్లో డాక్టర్లు, సిబ్బంది ఖాళీలుంటే భర్తీ చేసేందుకు  ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.