
- వైరా నదిపై వంగవీడు వద్ద రూ.630 కోట్లతో లిఫ్ట్ నిర్మాణం
- ఇయ్యాల ప్రాజెక్ట్ కు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం, మంత్రులు
- సాగర్ మెయిన్ కెనాల్ నుంచి నదిలోకి నీటి మళ్లింపు
- మూడు పంప్ హౌస్ ల ద్వారా ఆయకట్టు సాగుకు తరలింపు
- ఖమ్మం జిల్లా మధిర, ఎర్రుపాలెం మండలాల్లో 50 వేల ఎకరాలకు లబ్ధి
ఖమ్మం/ మధిర, వెలుగు : నాగార్జున సాగర్ చివరి ఆయకట్టు భూములకు సాగు నీరు అందక రైతులు పడ్తున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చాలాసార్లు పడావు పెట్టాల్సిన పరిస్థితి. ఇకముందు సాగునీటి కష్టాలకు శాశ్వతంగా చెక్ పెట్టేందుకు, చివరి ఆయకట్టు భూములకు రెండు పంటలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చొరవతో రూ.630 కోట్ల అంచనాతో వైరా నదిపై మధిర మండలం వంగవీడు వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ డిజైన్ చేశారు.
దీనికి జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్‌గా పేరుపెట్టారు. మూడో జోన్ లోని మధిర, ఎర్రుపాలెం మండలాలను రెండో జోన్ కిందకు తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ముందుగా సాగర్ ఎడమ కాల్వ నీటిని వైరా నదిలోకి మళ్లించి, మూడు పంప్‌హౌజ్‌లను నిర్మించడం ద్వారా మధిర, ఎర్రుపాలెం మండలాల్లో 50 వేల ఎకరాలకు సాగు నీరందనుంది. దీంతో జిల్లాలో 17 మండలాల్లోని సాగర్ఆయకట్టు పూర్తిగా జోన్–2 కిందకు మారనుంది. జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి ఇయ్యాల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జిల్లా ఇన్ చార్జి మంత్రి వాకిటి శ్రీహరి, ఆర్అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి మధిర మండలం వంగవీడు వద్ద నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. అక్కడే బహిరంగ సభ నిర్వహణకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
ఇన్నేండ్లుగా అరకొర నీళ్లే..
సాగర్ఎడమ కాల్వ కింద ఖమ్మం జిల్లాలో రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆనాటి పరిస్థితులను బట్టి మధిర, ఎర్రుపాలెం మండలాలను జోన్–3గా విభజించారు. జిల్లాలో మిగిలిన మండలాలు జోన్–2లో ఉంచారు. జోన్ –--3 లోని రెండు మండలాలకు నీరందాలంటే గ్రావిటీ ద్వారా ఏపీలో 30 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత తిరిగి తెలంగాణలోని ఆయకట్టుకు విడుదలయ్యేంది. తద్వారా నీటి విడుదల మరింత ఆలస్యమయ్యేది. ఇలా ఏటా 18 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందక రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఎండాకాలంలో పంటల సమయంలో నీటి విడుదలకు రైతులు ఆందోళన చేసిన ఘటనలు ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తమ భూములను జోన్–2 లోకి మార్చాలని రైతులు డిమాండ్‌చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక చొరవతో ప్రత్యామ్నాయంగా చివరి ఆయకట్టుకు నీరందించేందుకు కొత్తగా ప్రాజెక్ట్ డిజైన్చేసి, వైరా నదిపై వంగవీడు వద్ద లిఫ్ట్ నిర్మాణం
ఫైనల్ చేశారు.
లిఫ్టుల ద్వారా నీటి సరఫరా ఇలా..
తల్లాడ మండలం రెడ్డిగూడెం సమీపంలో సాగర్మెయిన్ కెనాల్(21 మెయిన్బ్రాంచ్ కెనాల్)51.70 కిలోమీటరు వద్ద నుంచి 500 క్యూసెక్కుల నీటిని ఎస్కేప్ లాకుల ద్వారా వైరా నదిలోకి మళ్లిస్తారు. కాగా.. మధిర మండలం వంగవీడు వద్ద వైరా నదిపై చెక్‌డ్యామ్ కట్టి, అక్కడే మినీ రిజర్వాయర్ నిర్మిస్తారు.
అక్కడ పంప్‌హౌజ్ లు నిర్మించి, మూడు మోటార్ల ద్వారా మధిర మండలం నాగవరప్పాడు వద్ద పైప్‌లైన్ నుంచి నిదానపురం మేజర్కాల్వలోకి నీటిని ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి కాల్వల ద్వారా కట్టలేరులోకి నీటిని మళ్లిస్తారు. అయ్యవారిగూడెం వద్ద రెండు పంప్ హౌజ్‌లు నిర్మించి పైప్‌లైన్‌ద్వారా మైలవరం బ్రాంచ్‌కెనాల్ కు, మరో పైప్ లైన్‌ద్వారా గుంటుపల్లిగోపారం వద్ద జమలాపురం బ్రాంచ్‌కెనాల్ కు నీటిని తరలిస్తారు. వీటి నిర్మాణాలు పూర్తయితే ఇప్పటికే ఉన్న 18 వేల ఎకరాల ఆయకట్టుతో పాటు అదనంగా మరో 30 వేల ఎకరాలకు లబ్ధి చేకూరనుందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశాం
మధిర మండలం వంగవీడు వద్ద జవహర్ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇది పూర్తయిన తర్వాత మధిర, ఎర్రుపాలెం మండలాలు ఆయకట్టు జోన్ –2లోకి మారతాయి. ఇయ్యాల లిఫ్ట్ కు డిప్యూటీ ముఖ్యమంత్రి, ముగ్గురు మంత్రులు హాజరై నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. - మంగళంపూడి వెంకటేశ్వర్లు, ఎస్ఈ, ఇరిగేషన్
రెండు పంటల సాగుకు వీలు
వంగవీడు ఎత్తిపోతలతో ఇకముందు మా ప్రాంత రైతులు రెండు పంటలు సాగు చేసుకునే వీలు కలుగుతుంది. ఎర్రుపాలెం, మధిర మండలాల్లో చివరి ఆయకట్టు గ్రామానికి నీళ్లు అందించేలా ప్రభుత్వం ఆలోచన చేసి.. ప్రాజెక్ట్ ను నిర్మిస్తుం డడం చాలా సంతోషంగా ఉంది. ఇన్నాళ్లు నీళ్లు లేక సాగు చేయలేకపోయాం. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా భవిష్యత్ తరాలకు వ్యవసాయానికి ఇబ్బంది ఉండదు. - పులిబండ్ల చిట్టిబాబు, సైదెల్లిపురం