
- టెండర్లకు త్వరలో కసరత్తు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర హైకోర్టు కొత్త బిల్డింగ్ డిజైన్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. శనివారం హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జడ్జీల కమిటీతో ఆర్ అండ్ బీ సెక్రటరీ దాసరి హరిచందన, సీఈ రాజేశ్వర్ రెడ్డి హైకోర్టులో భేటీ అయ్యారు. గతంలో ఆర్కిటెక్ సంస్థలు కొత్త హైకోర్టుకు మొత్తం 3 డిజైన్లను రెడీ చేసి ఆర్ అండ్ బీకి అందచేశాయి. వాటిలో పలు మార్పులు చేయాలని అధికారులు సూచించారు.
వారి సూచన మేరకు ఆర్కిటెక్ సంస్థలు మార్పులు చేసిన కొత్త డిజైన్లను మళ్లీ ఆర్ అండ్ బీ అధికారులకు అందచేశాయి. ఈ డిజైన్లను హైకోర్టు సీజే, జడ్జీల కమిటీకి అందచేయగా.. మూడు డిజైన్లలో ఒక దానిని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. సుమారు వెయి కోట్లతో రాజేంద్రనగర్ లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టును రాష్ర్ట ప్రభుత్వం నిర్మించనుంది. ఈ ఏడాది ఎంపీ ఎన్నికల సమయంలోసుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ శంకుస్థాపన కూడా చేశారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కార్యక్రమానికి సీఎం అటెండ్ కాలేదు. ఇప్పుడు ఫైనల్ అయిన డిజైన్ ను అధికారులు సీఎంకు చూపించనున్నారు. త్వరలో టెండర్లు పిలిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.