ఖమ్మంలో 15న లోక్ అదాలత్ : సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ రాజగోపాల్ పిలుపు

ఖమ్మంలో 15న లోక్ అదాలత్ :  సద్వినియోగం చేసుకోవాలని చైర్మన్ రాజగోపాల్ పిలుపు
  • జిల్లా న్యాయ సేవాధికార సంస్థ  చైర్మన్ రాజగోపాల్

ఖమ్మం టౌన్, వెలుగు :  ఈనెల 15న జరిగే ప్రత్యేక లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.రాజగోపాల్ సూచించారు. ఖమ్మం జిల్లా కోర్టులోని న్యాయ సేవ సదన్ లో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహణపై సోమవారం పోలీస్, బ్యాంకర్లు, చిట్ ఫండ్ ప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున ప్రతి మూడు నెలలకోసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. రాజీ చేసుకోవాలనుకునే క్రిమినల్, ఇతర కేసులకు లోక్ అదాలత్ ఒక వేదికగా నిలుస్తుందని చెప్పారు. 

యాక్సిడెంట్, భార్యాభర్తల వివాదాలు, చెక్ బౌన్స్ వంటి వివిధ కేసులను లోక్ అదాలత్ లో రాజీ చేసుకోవచ్చని సూచించారు. ప్రమాద కేసులు లోక్ అదాలత్ లో రాజీ చేసుకుంటే ఒకేసారి పరిహారం అందించాల్సి ఉంటుందన్నారు. లోక్ అదాలత్ లో కేసులను పరిష్కరించుకుంటే మళ్లీ ఉన్నత కోర్టులకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండదన్నారు. లోక్ అదాలత్ పై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో మొదటి అదనపు జిల్లా జడ్జి ఉమ, న్యాయమూర్తులు, జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు, నామినేటెడ్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు.