చలికాలం వచ్చేసింది, జలుబు అవుతుందేమో అని ప్రతిఒక్కరు కంగారుపడుతుంటారు. పిల్లలు, యువత పట్టించుకోకపోయినా చాలా మంది తల్లిదండ్రులు వెచ్చని దుస్తులు, స్వేటర్లు వేసుకోమని ఒత్తిడి చేస్తుంటారు. అంతేకాకుండా, ఇంట్లో ఫ్రిజ్ లో ఉన్న వాటిని తినొద్దని హెచ్చరిస్తారు కూడా.
అయితే, జలుబు గురించి ప్రజల్లో ఉన్న అపోహల కారణంగానే ఇలా జరుగుతోంది తప్ప, దీనికి సరైన వైద్యపరమైన కారణం లేదని డాక్టర్లు పూర్ణ ప్రజ్ఞ & సుమన్ హబల్కర్ చెబుతున్నారు.
చల్లని నీరు వల్ల : చల్లటి నీరు తాగడం వల్లే జలుబు వస్తుందనే ఆలోచనకు ఎటువంటి సైంటిఫిక్ ఆధారం లేదని యువ డాక్టర్లు డిసెంబర్ 1న ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో స్పష్టం చేశారు. ఆ ఆలోచన తనకు చిన్నతనంలో ఒక ఫోబియా కలిగించిందని డాక్టర్ హబల్కర్ సరదాగా చెప్పారు. దీనిపై డాక్టర్ ప్రజ్ఞ క్లారిటీ ఇస్తూ చల్లని నీటి వల్ల జలుబు రాదు. అది కేవలం వైరస్‌ల నుండి మాత్రమే వస్తుంది అని తెలిపారు. చలికాలంలో ఆరోగ్య సమస్యలకు సాధారణంగా చెప్పే కారణాలు ఫ్రిజ్‌లు, ఏసీల వల్లే అని.... కానీ నిజానికి అలంటిది ఏది కాదని డాక్టర్లు పేర్కొన్నారు. అయితే, తక్కువ టెంపరేచర్ మాత్రం జలుబు లక్షణాలను మరింత ఎక్కువ చేస్తుందని డాక్టర్ ప్రజ్ఞ హెచ్చరించారు.
జలుబు అంటే ఏంటి ?
క్లీవ్‌ల్యాండ్ క్లినిక్ ప్రకారం, సాధారణ జలుబు అనేది ముక్కు, గొంతు, సైనస్‌లు, శ్వాసనాళాన్ని ప్రభావితం చేసే పై శ్వాసకోశానికి సంబంధించిన ఒక ఇన్ఫెక్షన్. జలుబుకు కారణమయ్యే 200 కంటే ఎక్కువ రకాల వైరస్‌లు ఉన్నాయి, వాటిలో రైనోవైరస్ అత్యంత సాధారణమైనది.
జలుబు సాధారణ లక్షణాలు: జలుబు వైరస్ సోకిన ఒకటి నుండి మూడు రోజుల తర్వాత తుమ్ములు, ముక్కు కారడం, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, ముక్కు దిబ్బెడ, జ్వరం, ఈ లక్షణాలు కనిపిస్తాయి.

