డాక్టర్ల ట్రాన్స్‌‌‌‌ఫర్లపై లొల్లి

డాక్టర్ల ట్రాన్స్‌‌‌‌ఫర్లపై లొల్లి
  • తామేం తప్పు చేయలేదన్న డీఎంఈ రమేశ్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీల్లో డాక్టర్ల రిక్రూట్‌‌‌‌మెంట్ పై మరో వివాదం చెలరేగింది. పాత మెడికల్ కాలేజీల్లోని స్టాఫ్ నే, కొత్త మెడికల్ కాలేజీల్లోకి డిప్యూట్ చేసి మేనేజ్ చేస్తున్నారని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. దీనిపై నేషనల్ మెడికల్ కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నామని హెల్త్ రిఫార్మ్స్‌‌‌‌ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. కొత్త మెడికల్ కాలేజీల్లో ఇటీవలే ఎన్‌‌‌‌ఎంసీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. అక్కడ ఎంబీబీఎస్‌‌‌‌ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన వసతులు ఉన్నాయా.. స్టాఫ్‌‌‌‌ ఉన్నారా.. లేరా.. అన్న అంశాలను ఆరా తీశాయి. ఎన్‌‌‌‌ఎంసీ నిబంధనల ప్రకారం స్టాఫ్‌‌‌‌, ఇతర వసతులు ఉంటేనే కాలేజీలకు పర్మిషన్ ఇస్తారు. ఈ నేపథ్యంలో తనిఖీలకు ముందే పాత మెడికల్‌‌‌‌ కాలేజీల్లో పనిచేస్తున్న కొంత మంది ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లను కొత్త మెడికల్ కాలేజీల్లో డిప్యుటేషన్ పై పంపించారు. ఎన్‌‌‌‌ఎంసీ తనిఖీల్లో స్టాఫ్ కొరత బయటపడకుండా ఉండేందుకే ఈ డిప్యుటేషన్లు చేశారని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. ఎన్‌‌‌‌ఎంసీ తనిఖీలు ఉన్నప్పుడల్లా ఇక్కడి వాళ్లను అక్కడికి, అక్కడి వాళ్లను ఇక్కడికి పంపించి మేనేజ్ చేస్తున్నారని సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఈ విషయం ఎన్‌‌‌‌ఎంసీకి తెలిస్తే కాలేజీలకు పర్మిషన్ రాకపోగా, జాతీయ స్థాయిలో వివాదమై రాష్ట్రం పరువు పోతుందంటున్నారు. దీనిపై డీఎంఈ రమేశ్‌‌‌‌రెడ్డి స్పందిస్తూ తాము ఎన్‌‌‌‌ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా ఏమీ చేయడం లేదన్నారు. జనరల్ ట్రాన్స్ ఫర్లు లేనందునే డాక్టర్లను డిప్యుటేషన్‌‌‌‌పై కొత్త కాలేజీలకు పంపించామని ఆయన “వెలుగు’’కు తెలిపారు. ఉస్మానియా, గాంధీ కాలేజీల్లో ఎన్‌‌‌‌ఎంసీ నిబంధనల ప్రకారం ఉండాల్సిన స్టాఫ్‌‌‌‌ కంటే చాలా ఎక్కువ మంది ఉన్నారన్నారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఉన్న హాస్పిటళ్లలో పేషెంట్‌‌‌‌ లోడ్ కు అనుగుణంగా రిక్రూట్ చేశామని, ఇప్పుడు కొత్త కాలేజీలకు స్టాఫ్ అవసరం ఉండడంతో వీరినే అక్కడికి పంపిస్తున్నామన్నారు. ఇందులో ఎన్‌‌‌‌ఎంసీని మేనేజ్ చేసేది ఏం లేదని, ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా పని చేయాల్సిన బాధ్యత డాక్టర్లపై ఉంటుందన్నారు. దీనిపై ఎవరైనా ఎన్‌‌‌‌ఎంసీకి కంప్లైంట్ చేసుకోవచ్చని, సమాధానం చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని 
రమేశ్‌‌‌‌రెడ్డి సవాల్ విసిరారు.