సిటీలో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం

సిటీలో సోమవారం తాగునీటి సరఫరాకు అంతరాయం

హైదరాబాద్: మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న మెయిన్ పైప్ లైన్ అలైన్ మెంట్ మార్చాల్సి ఉన్నందున సోమవారం పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని అధికారులు ప్రకటించారు. కృష్ణా తాగునీటి సరఫరా ఫేస్-1, మెయిన్ పైప్ లైన్ ( 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్ కు) చాంద్రాయ‌న్‌గుట్టలోని ఓమ‌ర్ హోట‌ల్ వ‌ద్ద ఫూట్ ఓవ‌ర్ బ్రిడ్జి నిర్మాణం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో మిరాలం ఆలియాబాద్ ఆఫ్‌టేక్ పైప్‌లైన్‌ అలైన్‌మెంట్ మార్చాల్సి ఉందని వారు పేర్కొన్నారు. ఈనెల 11న సోమవారం ఉద‌యం 6 గంటల నుండి మరుసటి రోజు అంటే మంగ‌ళ‌వారం ఉద‌యం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయని తెలిపారు. ఈ క్రమంలో 24 గంటలపాటు మిరాలం ఆలియాబాద్ ఆఫ్‌టేక్ నుంచి నీటి స‌ర‌ఫ‌రా జ‌రిగే రిజ‌ర్వాయ‌ర్ల ప‌రిధిలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వివరించారు. 
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 1 -మీరాలం, కిషన్ బాగ్, అల్ జుబైల్ కాలనీ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
2. ఓ అండ్ ఎమ్ డివిజ‌న్ నం. 2 -అలియాబాద్, బాలాపూర్ రిజ‌ర్వాయ‌ర్ ప్రాంతాలు.
నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని ప్రజలు, వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకుని సహకరించాలని వారు కోరారు.