రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

రాష్ట్రంలో 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

హైదరాబాద్, వెలుగు: యాసంగి సీజన్‌‌కు అవసరమైన యూరియా పూర్తిగా అందుబాటులో ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. యాసంగి సీజన్‌‌లో ఇప్పటి వరకు రైతులు 3.71 లక్షల టన్నుల యూరియాను కొనుగోలు చేశారని, ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2.15 లక్షల టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని తెలిపారు. ఇది 47.68 లక్షల సంచులకు సమానమని మంత్రి వివరించారు. 

సీజన్‌‌కు అవసరమైనంత యూరియా పూర్తిగా రాష్ట్రంలో అందుబాటులో ఉందని, ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు విని రైతులు భయాందోళనకు గురై అవసరానికి మించి యూరియా కొనుగోలు చేయవద్దని మంత్రి సూచించారు. యూరియా అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెటింగ్‌‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాలే లక్ష్యంగా ఎరువుల సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహిస్తున్నదని, యాసంగి సీజన్ మొత్తం యూరియా కొరత తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. 

ఈ సీజన్‌‌ కోసం(అక్టోబర్ నుంచి మార్చి వరకు)కు గాను కేంద్రం రాష్ట్రానికి వివిధ రకాల ఎరువులు మొత్తం 20.10 లక్షల  టన్నులు కేటాయించగా, అందులో 10.40 లక్షల  టన్నుల యూరియా కేటాయించినట్లు మంత్రి తుమ్మల తెలిపారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రానికి 5.60 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా, ఇప్పటికే  24 వేల టన్నులు అదనంగా మొత్తం 5.84 లక్షల  టన్నులు సరఫరా జరిగిందని వెల్లడించారు.

జిల్లాల వారీగా యూరియా నిల్వలు ఇలా..

మంత్రి తుమ్మల ఆదేశాలతో మంగళవారం నుంచి అన్ని జిల్లాల్లో  కలెక్టర్ల పర్యవేక్షణలో యూరియా సరఫరా జరుగుతున్నదన్నారు. ఖమ్మం జిల్లాలో 13,936 టన్నులు, నల్గొండ జిల్లాలో13,936 టన్నులు నిజామాబాద్ జిల్లాలో 13,131 టన్నులు, సిద్దిపేట జిల్లాలో 10,980 టన్నులు, సూర్యాపేట జిల్లాలో 10,557 టన్నులు అత్యధికంగా నిల్వలు ఉండగా, అత్యల్పంగా ఆదిలాబాద్ జిల్లాలో 2,610 టన్నులు యూరియా ఉన్నట్లు  తెలిపింది.