- ఆయా ప్రాంతాలను నిషేధిత జోన్ గా ప్రకటించాలనే అభిప్రాయం
భద్రాచలం, వెలుగు : తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో గుర్తించిన పురాతన శిలాజాలు సుమారు16 కోట్ల ఏండ్ల కిందటివి భావిస్తున్నట్లు సిద్దిపేటకు చెందిన పరిశోధకులు అహోబిలం కరుణాకర్, నసీరుద్దీన్, భద్రాచలంకు చెందిన కొండవీటి గోపీ తెలిపారు. ములుగు జిల్లా కన్నయ్యగూడెం మండలం భూపతిపూర్పరిసరాల్లో సుమారు 3,0-40 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించిన పురాతన శిలాజాలను రెండు రోజులుగా పరిశీలించినట్టు, అవి పురాతన చరిత్రకు సజీవ సాక్ష్యమని పేర్కొన్నారు.
లక్షల ఏండ్ల కింద అడవులతో నిండి ఉండి, తర్వాత కాలంలో వచ్చిన వరదలు, ప్రవాహాలు, అవక్షేపణతో చెట్లు మట్టిలో కూరుకుపోయి క్రమంగా రసాయనిక మార్పులు చెంది రాళ్లుగా మారాయని భావిస్తున్నట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇక్కడి ప్రాంతాన్ని నిషేధిత జోన్‌గా ప్రకటించాలని, శాస్త్రీయ తవ్వకాలు, డాక్యుమెంటేషన్, జీఐఎస్మ్యాపింగ్వెంటనే చేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు.
ఇక్కడ పురాతన అడవుల కథ, ఆదిమానవుడి జీవనం, చరిత్ర, గోదావరి నది పూర్వ ప్రవాహాల సాక్ష్యం శిలాయుగం నుంచి మెగాలిథిక్ దశవరకు సాగిన మానవ సంస్కృతి ప్రయాణమని పేర్కొన్నారు. సరైన పరిశోధన జరిగి సంరక్షణ చర్యలు తీసుకుంటే తెలంగాణ పురావస్తు చరిత్రలో ఒక అత్యంత ముఖ్యమైన అధ్యాయంగా నిలిచే చాన్స్ ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.
