గ్రూప్‌‌ 1పై వచ్చే నెల 22న జడ్జిమెంట్‌‌ : హైకోర్టు

గ్రూప్‌‌ 1పై వచ్చే నెల 22న జడ్జిమెంట్‌‌ : హైకోర్టు
  • టీజీపీఎస్సీ, క్వాలిఫైడ్  అభ్యర్థుల వాదనలు విన్న హైకోర్టు బెంచ్
  •     తీర్పును రిజర్వ్  చేస్తున్నట్లు వెల్లడి
  •     సింగిల్ జడ్జి తీర్పు చట్టవ్యతిరేకమన్న కమిషన్

హైదరాబాద్, వెలుగు: గ్రూప్‌‌ 1 పరీక్షలపై సెప్టెంబర్​లో సింగిల్‌‌ జడ్జి చెప్పిన తీర్పును సవాలు చేస్తూ టీజీపీఎస్సీ, క్వాలిఫై అయిన అభ్యర్థులు (ఉద్యోగాల్లో చేరిన వాళ్లు) దాఖలు చేసిన అప్పీల్‌‌పై హైకోర్టు వచ్చే నెల జనవరి 22న తీర్పు చెప్పనుంది. అప్పటి వరకు గతంలో సింగిల్‌‌ జడ్జి ఆర్డర్‌‌పై విధించిన స్టే ఆదేశాలు అమల్లో ఉంటాయని చెప్పింది. అప్పీళ్లపై మంగళవారం ఇరు పక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును చీఫ్‌‌  జస్టిస్‌‌  ఏకే సింగ్, జస్టిస్‌‌ మొహియుద్దీన్‌‌ తో కూడిన డివిజన్‌‌  బెంచ్‌‌  రిజర్వు చేసింది. 

గ్రూప్‌‌1 పరీక్షల నిర్వహణలో అవతవకలు జరిగాయని, పారదర్శకంగా జరగలేదన్న కారణంగా మార్కుల తుది జాబితాను, జనరల్‌‌  ర్యాంకింగ్‌‌  జాబితాను రద్దు చేయడంతోపాటు జవాబు పత్రాలను తిరిగి మూల్యాకనం చేయాలని, లేదా పరీక్షలు మళ్లీ నిర్వహించాలని గతంలో సింగిల్‌‌  జడ్జి తీర్పు చెప్పారు. టీజీపీఎస్సీ తరపున ఏజీ సుదర్శన్‌‌ రెడ్డి వాదిస్తూ.. రాజ్యాంగ సంస్థ టీజీపీఎస్‌‌పీ వ్యవహారంలో కోర్టుల జోక్యానికి ఆస్కారం తక్కువన్నారు. ‘‘గ్రూప్‌‌ 1 పరీక్షల నిర్వహణపై సింగిల్‌‌ జడ్జి చెప్పిన తీర్పు చట్ట వ్యతిరేకం. 

టీజీపీఎస్సీ నోటిషికేషన్‌‌  రూల్స్‌‌కు భిన్నంగా తిరిగి మూల్యాంకనం చేయాలన్న తీర్పు చెల్లదు. ఇద్దరు చేసే మూల్యాకంనంలో తేడా 15 శాతం కన్నా ఎక్కువ వస్తే మూడో వ్యక్తి మూల్యాంకనం చేసే నిబంధనను పట్టించుకోలేదు. ఒకరు చేసిన మూల్యాంకనం గురించి మరొకరికి తెలియదు. పాలనా సౌలభ్యం కోసమే పరీక్షా కేంద్రాల పెంపు జరిగింది. కోఠి మహిళా కాలేజీలో 14.8 శాతం అభ్యర్థులు తొలి 500 మందిలో ఉన్నారనే వాదనకు ఆధారాలు చూపలేదు. నోటిఫికేషన్‌‌ నిబంధనల ప్రకారం మార్కులను తిరిగి లెక్కించడానికి మాత్రమే వీలుంది. పునఃమూల్యాంకనానికి కాదు” అని ఏజీ వాదించారు. 

రెండు హాల్ టికెట్లు ఎలా జారీ చేస్తరు?

అప్పీళ్లను డిస్మిస్‌‌  చేయాలని సింగిల్‌‌  జడ్జి వద్ద పిటిషన్లు వేసిన అడ్వకేట్లు వాదిస్తూ ఒక పరీక్షకు ఒకే హాల్‌‌ టికెట్‌‌  ఉండాలన్నారు. ‘‘గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండు హాల్‌‌ టికెట్లు జారీ చేశారు. హాల్‌‌ టికెట్లలో నంబర్లను  కూడా మార్చారు. పరీక్షా కేంద్రాలను కూడా మార్చారు. నాలుగు పరీక్షా కేంద్రాల్లో ఎగ్జామ్ కు హాజరైన అభ్యర్థులు అత్యధిక సంఖ్యలో అర్హత సాధించారు. 

కోఠి మహిళా కాలేజీలోని 18వ సెంటరులో 721 మంది మెయిన్స్‌‌ రాస్తే 39 మంది, అదే కాలేజీలోని 19వ సెంటరులో 776 మంది పరీక్ష రాస్తే 32 మంది ఎంపికయ్యారు. 563 మందిలో 12 శాతం మెయిన్స్‌‌కు అర్హత సాధించిన వారు ఒకే కాలేజీలో పరీక్షకు హాజరైనవారు” అని ఆ అడ్వకేట్లు పేర్కొన్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌‌కు వేర్వేరు హాల్‌‌ టికెట్లు ఎలా జారీ చేశారో కమిషన్  ఇచ్చిన వివరణ అస్పష్టంగా ఉందన్నారు. నాలుగు సెంటర్లలో పరీక్షకు హాజరైన వారిలో ఏకంగా 162 మంది ఎంపిక య్యారని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న బెంచ్.. తీర్పును రిజర్వ్  చేశామని ప్రకటించింది.