సూర్యాపేట, వెలుగు: మొబైల్ ఫోన్ల ద్వారానే ఎక్కువగా సైబర్ మోసాలు జరుగుతున్నాయని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్‌ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు రూ.20 లక్షల విలువైన 104 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి ఎస్పీ నరసింహ సంబంధిత మొబైల్‌ఫోన్ల యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసు శాఖ ప్రజల రక్షణలో నిరంతరాయంగా కృషి చేస్తుందన్నారు.
ఫోన్ గుర్తించడంలో సిబ్బంది పటిష్టంగా పని చేశారని, ప్రజల రక్షణలో కుటుంబాలు దూరంగా ఉంటూ పని చేస్తున్నారని పోలీసు సేవలను ప్రజలు గుర్తించాలన్నారు. ఈ సంవత్సరం 8వ దఫా మొబైల్‌మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్‌ను బాధితులకు అందించామని తెలిపారు. ఈ పోర్టల్‌ద్వారా ఈ సంవత్సరం 1334 మొబైల్‌లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్‌బీ డీఎస్పీ రవి, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
