- డీజేలకు అనుమతుల నిరాకరణ
- మైనర్ డ్రైవింగ్ చేస్తే తల్లిదండ్రులపై కేసులు
ఆదిలాబాద్, వెలుగు: న్యూ ఇయర్ వేడుకలపై ఆదిలాబాద్ జిల్లా పోలీసులు పటిష్ట నిఘా పెట్టారు. 31 రాత్రి వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులకు కీలక సూచనలు చేశారు. యువత నిబంధనలకు లోబడి వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 30 డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు, పట్టణంలో 15 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయనున్నట్లు వెల్లడించారు.
మద్యం సేవించి వాహణాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులు రాంగ్ సైడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, రేసింగ్ లాంటివి చేయొద్దన్నారు. వాహనాలు నడిపిన మైనర్లు, వారి తల్లిదండ్రులపై కేసులు తప్పవని హెచ్చరించారు.
డీజేలకు అనుమతులు లేవని, రోడ్లపై కేక్ కటింగ్‌లు చేయొద్దని ఆదేశించారు. ఇండ్లపై సౌండ్ బాక్స్ లు, మైక్ సిస్టంలతో వేడుకలను నిర్వహించేవారు కచ్చితంగా పోలీసుల అనుమతులను తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అనుమతులు లేనిదే ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఈవెంట్లు, ప్రోగ్రామ్లను నిర్వహించొద్దని.. జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని తెలిపారు.
