భూమి విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న.. మెదక్‌‌ జిల్లా పాపన్నపేటలో దారుణం

భూమి విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న.. మెదక్‌‌ జిల్లా పాపన్నపేటలో దారుణం

పాపన్నపేట, వెలుగు: భూమి అమ్మకం, రిజిస్ట్రేషన్‌‌ విషయంలో గొడవ జరగడంతో ఓ వ్యక్తి తమ్ముడిని హత్య చేశాడు. ఈ ఘటన మెదక్‌‌ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని బాచారం గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది.

ఎస్సై శ్రీనివాస్‌‌గౌడ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన చాకలి ఆశయ్య, దశరథ్‌‌ (36) అన్నదమ్ములు. దశరథ్‌‌ తన అన్న ఆశయ్య వద్ద కొన్ని నెలల కింద ఏడు గుంటల భూమి కొన్నాడు. డబ్బులు మొత్తం చెల్లించి భూమిని తన పేరు మీదకు రిజిస్ట్రేషన్‌‌ చేయాలని దశరథ్ కోరినా ఆశయ్య పట్టించుకోపోగా.. అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశాడు. 

ఈ విషయంలో ఇద్దరు మధ్య పంచాయితీ జరుగగా.. పెద్దమనుషులు నచ్చజెప్పినా ఆశయ్య వినిపించుకోలేదు. ఈ క్రమంలో సోమవారం రాత్రి దశరథ్‌‌... ఆశయ్యకు ఫోన్‌‌ చేసి భూమిని తన పేరు మీద రిజిస్ట్రేషన్‌‌ చేయాలని కోరడంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. కొద్దిసేపటి తర్వాత గ్రామంలోని చౌరస్తా వద్ద ఉన్న దశరథ్‌‌ ఉన్నట్లు తెలుసుకున్న ఆశయ్య కత్తితో వచ్చి తమ్ముడిపై దాడి చేశాడు. 

దశరథ్‌‌ కుమారుడు సంగమేశ్వర్‌‌ అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో అతడిపైనా దాడి చేశాడు. గమనించిన స్థానికులు దశరథ్‌‌, అతడి కొడుకు సంగమేశ్వర్‌‌ను మెదక్‌‌ ఏరియా హాస్పిటల్‌‌కు తరలించారు. పరీక్షించి డాక్టర్లు దశరథ్‌‌ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.