నల్గొండ, వెలుగు: జిల్లా వ్యాప్తంగా తప్పిపోయిన నిరాదరణకు గురై వెట్టి చాకిరీకి లోనవుతున్న పిల్లలను గుర్తించి రక్షించడానికి పోలీస్ శాఖ ‘ఆపరేషన్ స్మైల్’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తోందని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. జనవరి 1 నుంచి 31 వరకు నెల రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరిలో ‘ఆపరేషన్ స్మైల్, జులైలో ‘ఆపరేషన్ ముస్కాన్’ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్‌లలో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో తనిఖీలు చేపడతామని చెప్పారు. బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు, దుకాణాలు, హోటళ్లు, పరిశ్రమలు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. 18 సంవత్సరాల లోపు తప్పిపోయిన, బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి రక్షిస్తామని వివరించారు.
అవసరమైతే పిల్లలను తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా స్టేట్ హోమ్‌కు పంపిస్తామన్నారు. చైల్డ్ లేబర్ యాక్ట్, జువెనైల్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 చైల్డ్‌లైన్ లేదా డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు.
