విమర్శలు మాని.. అభివృద్ధిపై దృష్టి పెట్టు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్‌

విమర్శలు మాని.. అభివృద్ధిపై దృష్టి పెట్టు : బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్‌
  •     అన్నాతమ్ముళ్లను విడగొట్టే సిద్ధాంతాలు మావికావు
  •     రెండేండ్లు గడిచినా నియోజకవర్గ అభివృద్ధి జీరో
  •     ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌పై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌ ఫైర్‌

గుడిహత్నూర్, వెలుగు: బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ఇతరులపై విమర్శలు మానుకొని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగే బ్రహ్మనంద్‌ మండిపడ్డారు. మంగళవారం గుడిహత్నూర్‌ మండల కేంద్రంలో తన నివాసంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి మాట్లాడారు. బోథ్‌ ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ తమ్ముడు జ్ఞానేశ్వర్‌ నవంబర్‌ లో ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్‌ ఆధ్వర్యంలో బీజేపీలో జాయిన్‌ కాగా తాజాగా సోమవారం హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. 

అయితే జ్ఞానేశ్వర్‌ బీజేపీలో చేరినట్లు జరిగిన ప్రచారం వాస్తవం కాదని, అన్నదమ్ములను ఎవరూ విడదీయలేరని ఎమ్మెల్యే అనిల్‌ జాదవ్‌ ప్రెస్‌ మీట్‌ పెట్టి ఖండించారు. ఈ విషయంపై పతంగే బ్రహ్మనంద్‌ తాజాగా మాట్లాడారు. బీజేపీలో చేరుతానని  జ్ఞానేశ్వర్‌ ఎన్నిసార్లు తన ఇంటికి వచ్చాడో, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు ఎన్నిసార్లు వచ్చాడో ఆయననే అడిగి తెలుసుకోండని సూచించారు. కావాలంటే సీసీ కెమెరా ఫుటేజీ కూడా ఇస్తానని తెలిపారు. అన్నాతమ్ముళ్లను విడగొట్టే పార్టీ తమదికాదని, అలాంటి లక్షణాలు మీపార్టీలోనే ఉన్నాయని ఎద్దేవా చేశారు. 

ఎమ్మెల్యేగా గెలిచి రెండేండ్లు పూర్తయినా.. ఎన్నికల్లో ఇచ్చిన ఏఒక్క హామీకూడా నెరవేర్చలేదని విమర్శించారు. ఇటీవల పార్టీ కార్యకర్తల సమావేశంలో అనిల్‌ జాదవ్‌ మాట్లాడుతూ ‘మన నియోజకవర్గంలో మనమే సీఎం.. మనమే మంత్రి.. అన్నీ మనమే.. ఎవరినీ రానిచ్చేదిలేదు’ అని చేసిన వ్యాఖ్యలను కూడా బ్రహ్మానంద్ ​ఖండించారు. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తే నియోజకవర్గ ప్రజలు సహించరని హితవుపలికారు. ప్రెస్‌మీట్‌లో బీజేపీ రైల్వేబోర్డ్‌ మెంబర్‌ గణేశ్​పాటిల్, బీజేపీ మండల అధ్యక్షుడు కేంద్రే శివ, బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు జునుగురు మహేశ్, కేంద్రే కుమార్, కోవ జలపత్, లక్ష్మీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.