కమర్షియల్ కోర్టులనేవి చాలా ప్రాముఖ్యత కలిగిన కోర్టులు. ఈ కోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం సంబంధిత ప్రభుత్వం చేస్తుంది. కమర్షియల్ కోర్టు చట్టం, 2015లోని సె.3 సబ్‌సెక్షన్ 3 ప్రకారం న్యాయమూర్తుల నియామకం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ నిబంధన ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి సమ్మతితో ఈ కమర్షియల్ కోర్టులకు న్యాయమూర్తులని నియమించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ మన రాష్ట్రంలో హైకోర్టే నేరుగా ఈ న్యాయమూర్తులని నియమిస్తుంది. ఈ నిబంధనని హైకోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకొని రాలేదని అనిపిస్తోంది. హైకోర్టు నేరుగా ఈ న్యాయమూర్తులని నియమించడం మంచిదని రాజస్థాన్ న్యాయమూర్తి ఉదంతం చూసిన తర్వాత అనిపిస్తోంది.
జూలై 5 తేదీన జైపూర్ కమర్షియల్ కోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్ గుప్తా అదానీ నేతృత్వంలోని ఒక సంస్థ రాజస్థాన్ ప్రభుత్వ యాజమాన్యంలోని .. కంపెనీని నష్ట పరిచి రవాణా చార్జీల రూపంలో రూ. 1400 కోట్లకు పైగా సంపాదించిందని తీర్పుని ప్రశంసించారు. అదే రోజు రాజస్థాన్ ప్రభుత్వం అతన్ని ఆ పదవి నుంచి ఉపసంహరించుకుంది.
గుప్తాను ఉపసంహరిస్తూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంలోని న్యాయశాఖ ఉత్తర్వులని జారీ చేసింది. అతడిని వేరే చోట నియమించేందుకు వీలుగా హైకోర్టుకి తిరిగా పంపుతున్నట్లు కూడా ఆ ఉత్తర్వులో న్యాయశాఖ పేర్కొంది. ఆ రోజే రాజస్థాన్ హైకోర్టు గుప్తాను బియావర్కు బదిలీ చేసింది. అది రాష్ట్ర రాజధానికి 200 కి.మీ ల దూరంలో ఉంటుంది. రెండు వారాల తర్వాత గుప్తాకు విధించిన రూ.50 లక్షల జరిమానా మీద హైకోర్టు స్టే ని విధించింది.
వివాదం ఏమిటి ?
భారతదేశంలోని అత్యంత వివాదాస్పదమైన కాంట్రాక్టుల్లో ఆ మైనింగ్ ఒకటి. ఈ అంశం మీద గుప్తా ఇచ్చిన తీర్పుతో విషయం వివాదాస్పదమైంది. 2007లో చత్తీస్‌గఢ్‌లోని హస్టియో అరండ్అడవిలోని ఒక బొగ్గు బ్లాకును రాష్ట్ర ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ సంస్థ అయిన రాజస్థాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్‌కు కేటాయించింది.
థర్మల్ విద్యుత్ ప్లాంటుకు బొగ్గును నేరుగా పొందేందుకు ఈ కేటాయింపుని చేశారు. కానీ ఆ సంస్థ అదానీ గ్రూపుతో జాయింట్ వెంచర్ లోకి ప్రవేశించింది. ఇందులో 74శాతం ప్రైవేటు సమ్మేళనం వాటాను కలిగిఉంది. మైనింగ్ కార్యకలాపాలను అవుట్సోర్స్ చేసింది. రాజస్థాన్, అదానీ నేతృత్వంలోని జాయింట్ వెంచర్ సంతకం చేసిన ఒప్పందం ప్రకారం చత్తీస్‌గఢ్ నుంచి బొగ్గుని రైలు ద్వారా రాజస్థాన్‌కు రవాణా చేయాలి. ఇందుకోసం అదానీ నేతృత్వంలోని సంస్థ రైల్వే సైడింగ్స్ని నిర్మించాలి.
2013లో మైనింగ్ మొదలైంది. కానీ చాలా ఏండ్ల వరకు రైల్వే సైడింగ్ నిర్మాణాన్ని చేపట్టలేదు. సైడింగ్ లు వేసేవరకు గని నుంచి రైల్వే స్ఠేషన్లకు రోడ్డు ద్వారా బొగ్గును తరలించడానికి రెండు సంస్థలు అంగీకారానికి వచ్చాయి. వీరి మైనింగ్, డెలివరీ ఒప్పందంలో రోడ్డు రవాణా విషయం ప్రస్థావన లేదు. ఈ రవాణా ఖర్చు రూ.1400 కోట్లుగా అదానీ నేతృత్వంలోని సంస్థ రాజస్థాన్ సంస్థకి బిల్లు వేసింది.
రాజస్థాన్ సంస్థ ఆ బిల్లుని చెల్లించింది. 2018 లో డబ్బు చెల్లించడంలో జాప్యం జరిగిందని అందుకు వడ్డీని కూడా చెల్లించాలని అదానీ సంస్థ డిమాండ్ చేసింది. అందుకు ఆ సంస్థ నిరాకరించింది. 2020 లో ఈ విషయం కమర్షియల్ కోర్టుకి వచ్చింది. ఈ దరఖాస్తును అదానీ నేతృత్వంలోని సంస్థ దాఖలు చేసింది. అయితే తీర్పు అదానీ సంస్థకు అనుకూలంగా రాలేదు. రాజస్థాన్ సంస్థకు అనుకూలంగా వచ్చింది.
అదానీ సంస్థపై 50 లక్షల జరిమానా.. తీర్పు చెప్పిన రోజే జడ్జి బదిలీ
పార్టీల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం సమీప అనుసంధాన రైల్వే లైన్ వరకు రైల్వే సైడింగ్‌ను నిర్మించడం అభివృద్ధి చేయడం అదానీ నేతృత్వంలోని జాయింట్ వెంచర్ బాధ్యత. ఇదే విషయాన్ని గుప్తా తన తీర్పులో పేర్కొన్నారు. ఆ జాయింట్ వెంచర్ అలా చేయడంలో విఫలమైనందున అదానీ దాని స్వంత డిఫాల్ట్‌కు కనీస రోడ్డు రవాణా చార్జీల భారాన్ని భరించి ఉండాల్సిందని గుప్తా తన తీర్పులో అభిప్రాయపడ్డారు. అలా కాకుండా ఆ కంపెనీ రూ.1400 కోట్లను కోరింది. అంతేకాదు దాని మీద వడ్డీని కూడా కోరింది. ఈ విషయాలన్నీ గుప్తా తన తీర్పులో పేర్కొన్నారు. అదనపు లాభం పొందడానికి అదానీ నేతృత్తంలోని సంస్థ దరఖాస్తును పెట్టింది.
ఈ అంశాలన్నీ పేర్కొంటూ కమర్షియల్ కోర్టు 50 లక్షల జరిమానాను అదానీ సంస్థపై విధించింది. అంతే కాదు రెండు సంస్థల మధ్య జరిగిన ఒప్పందాన్ని ఆడిట్ చేయాలని, ఇందు గురించి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌ను కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జులై 18 వ తేదీన హైకోర్టు గుప్తా ఉత్తర్వులపై స్టే విధించింది. ఈ విషయం మీద విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి.
తదుపరి విచారణ జనవరి 2026 చివరి వారంలో జరగనున్నాయి. గుప్తా తీర్పు చెప్పిన రోజే అతన్ని ఆ పదవి నుంచి ఉపసంహరించడానికి ఇతరేతర కారణాలు ఉన్నాయోమో మనకు తెలియదు. కానీ ఆ తీర్పు చెప్పిన రోజే ఆ జడ్జిని ఉపసంహరించడం వల్ల ఆ తీర్పును వెలువరించినందుకు ఉపసంహరించినారని అనుమానించడం సహజం.
ప్రభుత్వం నియమించక పోతే..
మన రాష్ట్రంలో కమర్షియల్ కోర్టు న్యాయమూర్తలను ప్రభుత్వం నియమిస్తున్నట్లుగా లేదు. ఇందుకోసం ప్రత్యేకంగా జీవోని జారీ చేసినట్టుగా కూడా అనిపించడంలేదు. హైకోర్టే ఈ న్యాయమూర్తులను నేరుగా నియమిస్తున్నట్లుగా హైకోర్టు ప్రొసీడింగ్స్ చూస్తే తెలుస్తుంది. అధికారాన్ని ప్రభుత్వం డెలిగేట్ చేసే విధంగా చట్టంలో ఎక్కడా చెప్పలేదు. ఆ విధంగా డెలిగేట్ చేసినట్టుగా హైకోర్టు ప్రొసీడింగ్స్‌లో ఎక్కడా చెప్పలేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ కోర్టులు ఇచ్చిన తీర్పులకు న్యాయబద్దత ఉంటుందా? ఈ విషయం హైకోర్టు దృష్టికి వెరెవరూ తీసుకొని రాలేదా? ఇది తీవ్రమైన విషయంగా నాకు అనిపిస్తోంది.
ట్రాన్స్‌పోర్టు ఆప్పిలేట్ ట్రిబ్యునల్‌ను, సేల్స్‌టాక్స్ ట్రిబ్యునల్‌ను చైర్మన్లకు ప్రభుత్వం అధికారాలను ఇస్తుంది. అ కమర్షియల్ కోర్టు న్యాయమూర్తులకు అలా ఇస్తున్నట్టుగా కూడా అనిపించడం లేదు. ఈ విషయాలను హైకోర్టు పరిశీలించి సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేచి చూడటం తప్ప చేయగలిగిందేమీ లేదు. ఈ కోర్టుల్లో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదులు కూడా అలోచించాల్సిన విషయం.
డా. మంగారి రాజేందర్, జిల్లా జడ్జి (రిటైర్డ్)
