ప్రకృతి ప్రసాదించిన నీటి వనరుల్లో రాష్ట్రానికి న్యాయమైన వాటా దక్కలేదనే అసంతృప్తితో తెలంగాణ ఉద్యమంలో జలవనరుల అంశం కీలక పాత్ర పోషించింది. మన నీరు మనకు లభిస్తుందని తెలంగాణ ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ బీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో అడియాశలయ్యాయి.
నీటి ప్రాజెక్టులలో నాటి బీఆర్‌ఎస్ పాలకులు చేసిన లోపాలను కాంగ్రెస్ ప్రభుత్వం బహిర్గతం చేస్తుండడంతో ఆ పార్టీ నేతలు ప్రభుత్వంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. అందులో భాగంగానే పాలమూరు`రంగారెడ్డి ప్రాజెక్టులో గతంలో కేసీఆర్ సర్కారు చూపించిన వివక్ష, చేసిన పలు తప్పిదాలు బయటపడుతుంటే బీఆర్‌ఎస్ నేతలు తట్టుకోలేక చేస్తున్న తప్పుడు ఆరోపణలు చూస్తుంటే ‘దొంగే.. దొంగ దొంగ అన్నట్టు’ ఉంది.
తెలంగాణకు మణిహారమైన పాలమూరు ప్రాజెక్టు రాష్ట్రానికి కీలకమైన నీటి వనరుగా మారబోతుందని ఆశిస్తున్న ప్రజలను కేసీఆర్ సర్కార్ దగా చేసింది. శ్రీశైలం జలాశయం నుండి 90 టీఎంసీల జలాలను తరలించి నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ జిల్లాల్లో దాదాపు 12.3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు, సుమారు 1200 గ్రామాలకు తాగునీరు అందించే ప్రధాన లక్ష్యంగా రూ.35,000 కోట్ల అంచనాలతో 2015 జూన్ 10న ప్రాజెక్టుకు బీఆర్‌ఎస్ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత అంచనా విలువ అమాంతం రూ.55,086 కోట్లకు చేరింది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు 27 వేల కోట్ల రూపాయలకుపైగా ఖర్చు చేసినా.. ఒక్క ఎకరాకు కూడా నీరు అందలేదు. ముందస్తు పర్యావరణ అనుమతులు లేకుండా హడావుడిగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు చేపట్టి నిబంధనలు ఉల్లంఘించిందని ఎన్జీటీ పర్యావరణ పరిహారంగా రాష్ట్రానికి జరిమానా విధించింది.
బీఆర్ఎస్ ప్రభుత్వ తప్పిదమే శాపంగా మారింది
పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో చేసిన పలు తప్పిదాలు ఇప్పుడు రాష్ట్రానికి శాపంగా మారాయి. వాస్తవానికి పాలమూరు ప్రాజెక్టుకు చేయాల్సిన 90 టీఎంసీల కేటాయింపుల్లో 45 టీఎంసీలు కృష్ణా నుండి, మరో 45 టీఎంసీలు గోదావరి నుండి మళ్లించడం ద్వారా తీసుకుంటామని 18 ఆగస్టు 2022 తేదీన బీఆర్‌ఎస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో వ్యూహాత్మక తప్పిదం. 45 టీఎంసీల గోదావరి నీటికి సంబంధించిన విషయం ట్రిబ్యునల్ (సీడబ్ల్యుసీ)లో పెండింగ్ ఉండడంతో 90 టీఎంసీల కేటాయింపులు చేయలేమని కేంద్ర జలసంఘం స్పష్టం చేయడం పాలమూరు ప్రాజెక్టుకు గుదిబండగా మారింది.
ఇటువంటి అనిశ్చితి పరిస్థితుల్లో ప్రాజెక్టు పనుల్లో ఇబ్బందులు లేకుండా ఉండాలనే లక్ష్యంతో 45 టీఎంసీల కృష్ణా జలాలను మొదటి దశలో కేటాయించాలని, తర్వాత దశలో 45 టీఎంసీలు కేటాయించాలని కోరుతూ సీడబ్ల్యూసీకి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ రాస్తే, బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు తగ్గించాలని ప్రభుత్వం లేఖ రాసిందని వక్రీకరించాలని చూడడం దురదృష్టకరం.
నాడు ప్రతిపక్షంగా కాంగ్రెస్ గొంతెత్తితేనే ట్రిబ్యునల్ వచ్చింది
తెలుగు రాష్ట్రాల మధ్య 2015లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందంతో తెలంగాణకు అన్యాయం జరిగింది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి లభించిన 811 టీఎంసీలలో సర్దుబాటు పేరుతో ఏపీకి 66 శాతం మేర అంటే 512 టీఎంసీలు, తెలంగాణకు 34 శాతం మేర అంటే 299 టీఎంసీలు జలాలు కేటాయింపు ఆమోదానికి కేసీఆర్ సర్కార్ తలొగ్గి రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది.
50:50 శాతం నిష్పత్తిలో నీటి కేటాయింపులు ఉండాల్సి ఉండగా, అన్యాయంగా ఏపీకి అనుకూలంగా 66:34 నిష్పత్తిలో కేటాయింపులు జరిగాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఖరిని నాటి ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నిలదీయడంతోనే అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టంలోని సెక్షన్(3) అంశం తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ఒత్తిడితోనే 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌ను ఆమోదించింది. అంతేకాని ఇందులో బీఆర్‌ఎస్ చేసిందేమీ లేదు.
ఏపీ నీటి దోపిడీపై ఏనాడూ నోరెత్తని కేసీఆర్
కృష్ణా జలాల్లోనే కాదు గోదావరి జలాల్లోనూ కేసీఆర్ సర్కార్ తెలంగాణకు అన్యాయం చేసింది. గోదావరి జలాలను రాయలసీమకు తరలించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని కేసీఆర్ ఏ హోదాలో గొప్పలకు పోయి ప్రకటించారో బీఆర్‌ఎస్ నేతలు సమాధానం చెప్పాలి. ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు టెండర్లు పూర్తయినా కేసీఆర్ అపెక్స్ సమావేశంలో గొంతెత్తలేదు. బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డు కాకుండానే ఏపీ ఆర్డీఎస్ కుడి కాల్వ విస్తరణకు పనులు చేపడితే నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్పందించలేదు.
కేసీఆర్ సర్కార్ తీరుతో మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం రైతులు నష్టపోతున్నా పట్టనట్టు వ్యవహరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం కాళేశ్వరాన్ని రోజుకు 2 టీఎంసీల నుండి 3 టీఎంసీలకు పెంచిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం... పాలమూరు సామర్థ్యాన్ని మాత్రం 2 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి తగ్గించి ప్రాజెక్టు లక్ష్యాన్ని నీరుగార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు చేసిన లక్ష కోట్ల రూపాయలలో సగం పాలమూరుకు చేసినా ప్రాజెక్టు ఎప్పుడో పూర్తయ్యేదని ఇంజినీర్లు చెబుతున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిబద్ధతను చాటుకుంటున్నది
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని ప్రాధాన్యత ప్రాజెక్టుల జాబితాలో పాలమూరుకు పెద్ద పీట వేశారు. 11 పంపుల ఇన్‌స్టాలేషన్ చేపట్టారు. రూ.7 వేల కోట్లు ఖర్చు చేసి 67 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 7 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని పూర్తి చేయడంతో పాటు 9 కిలో మీటర్ల కాల్వలు తవ్వి కాంగ్రెస్ ప్రభుత్వం నీటి ప్రాజెక్టులపై తమ నిబద్దతను చాటుకుంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు 90 టీఎంసీల కేటాయింపుతో 12 లక్షల ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఎంత ఖర్చు అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడకుండా పూర్తి చేస్తుంది.
సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం మొదలుకొని అన్ని నీటి ప్రాజెక్టుల్లోనూ అంతులేని అవినీతికి పాల్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వారి అవినీతి చిట్టాలను విప్పుతుండడంతో దిక్కుతోచని బీఆర్‌ఎస్ నేతలు అబద్దాలతో గ్లోబెల్ ప్రచారం చేస్తున్నా ప్రజలకు వాస్తవాలు తెలుసు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులను తమ అవినీతికి కేరాఫ్‌గా మార్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా తెలంగాణ సస్యశ్యామలం లక్ష్యంగా ముందుకెళ్తోంది.
‘పాలమూరు’ ను అంతర్రాష్ట్ర జల వివాదంగా మార్చారు
ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాకు ఇంజినీర్లు 2014లో జూరాల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుండి నీటిని ఎత్తిపోతల ద్వారా దక్షిణ తెలంగాణకు సాగునీటి అందించవచ్చని డీపీఆర్ తయారు చేస్తే.. కేసీఆర్ తానే మేధావిగా ఊహించుకొని ఆ ప్రతిపాదనకు ఒప్పుకోకుండా శ్రీశైలం నుండి ఎత్తిపోతల ద్వారా నీటిని తీసుకురావాలని నిర్ణయించడంతో ప్రాజెక్టు అంతర్రాష్ట్ర జల వివాదంగా మారింది. కేసీఆర్ సర్కారు పాలమూరు ప్రాజెక్టును తాగునీరు అవసరాల కోసమే కడుతున్నామని చెబుతూ 7.15 టీఎంసీలు సరిపోతాయని గతంలో సుప్రీం కోర్టుకు చెప్పి రాష్ట్ట్రానికి తీవ్ర అన్యాయం చేసింది.
2015లో పాలమూరు ప్రాజెక్టు నిర్మాణం కోసం జీవో విడుదల చేసిన బీఆర్‌ఎస్ ప్రభుత్వం 2022 సెప్టెంబర్ అంటే ఏడేళ్ల వరకు డీపీఆర్ సమర్పించకపోవడమే వారి నిర్లక్ష్యానికి నిదర్శనం. డీపీఆర్ తయారు చేయకముందే రూ.27 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన అవినీతి చరిత్ర బీఆర్‌ఎస్ పాలకులది. పాలమూరు ప్రాజెక్టు పనుల్లో వేగవంతం అవసరం లేదని ఉద్ధేశపూర్వకంగా ఇంజనీర్లకు చెప్పిన కుట్రదారులు బీఆర్‌ఎస్ పాలకులు. ఎస్‌ఎల్బీసీకి రూ.2 వేల కోట్లు, కల్వకుర్తికి రూ.900 కోట్లు ఖర్చు చేస్తే పనులు పూర్తయ్యేవని తెలిసినా కేసీఆర్ ప్రభుత్వం కావాలని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసింది.
బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు
