హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే.. బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతియ్యలే: మంత్రి ఉత్తమ్

హరీశ్ చెప్పేవన్నీ అబద్ధాలే.. బనకచర్లకు సీడబ్ల్యూసీ అనుమతియ్యలే: మంత్రి ఉత్తమ్
  • 200 టీఎంసీలు కేటాయింపు అనేది అవాస్తవం
  • పీఎఫ్‌ఆర్‌‌కు ఆమోదం తెలపలేదని ఈ నెల 4నే కేంద్రం లేఖ రాసింది
  • డీపీఆర్​ కూడా తయారు చేయొద్దంటూ ఏపీకి చెప్పింది
  • మేం సుప్రీంకోర్టులో కేసు వేశాం.. జనవరి 5న విచారణకు వస్తదని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్​ విషయంలో బీఆర్‌‌ఎస్​ ఎమ్మెల్యే హరీశ్‌రావు పచ్చి అబద్ధాలు చెప్పారని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌‌ రెడ్డి మండిపడ్డారు. పోలవరం –బనకచర్ల ప్రాజెక్టుకు సెంట్రల్​ వాటర్​ కమిషన్ (సీడబ్ల్యూసీ)​ ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అక్కసుతో పోలవరం –బనకచర్ల ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేశారని విమర్శించారు. హరీశ్‌రావు వ్యాఖ్యలపై ఉత్తమ్‌కుమార్‌‌రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో స్పందించారు. ప్రాజెక్టును ఆపేందుకు అన్ని విధాలా పోరాడుతున్నామని, సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున ఇప్పటికే రిట్​ పిటిషన్​ దాఖలు చేశామని గుర్తు చేశారు.

ఆ పిటిషన్​ జనవరి 5న సుప్రీంకోర్టులో విచారణకు వస్తుందని, చీఫ్​ జస్టిస్​ విచారిస్తారని చెప్పారు. ప్రాజెక్టును ఆపేందుకు ప్రభుత్వం ఎంత సీరియస్‌‌‌‌గా ఫైట్​ చేస్తున్నదో, రాష్ట్ర జల ప్రయోజనాలను కాపాడేందుకు ఎంతలా ప్రయత్నిస్తున్నామో చెప్పేందుకు ఇదొక్కటి చాలని అన్నారు. గోదావరి జలాలను ఏపీ అక్రమంగా తరలించుకుపోతున్న వ్యవహారంపై ఎప్పుడూ నిర్ణయాత్మకంగానే వ్యవహరిస్తున్నామని స్పష్టం చేశారు. 

హరీశ్‌‌‌‌ ఆరోపణలన్నీ నిరాధారమైనవే..
ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ 200 టీఎంసీల జలాలు కేటాయిస్తూ అనుమతించిందనడంలో వాస్తవం లేదని ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి తెలిపారు. ‘‘పోలవరం–బనకచర్ల ప్రాజెక్టుకు కేంద్ర జలశక్తి శాఖ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు. అసలు డిటెయిల్డ్​ ప్రాజెక్ట్​ రిపోర్ట్​ (డీపీఆర్​)ను ఏపీ తయారు చేయడాన్ని కూడా తిరస్కరించింది. 

ప్రాజెక్టుకు సూత్రప్రాయ అనుమతులు రాకుండా డీపీఆర్‌‌‌‌‌‌‌‌ను తయారు చేయొద్దంటూ ఏపీకి కేంద్రం స్పష్టం చేసింది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు (పీఎఫ్‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌)కు ఇప్పటిదాకా అనుమతి రాలేదు. హరీశ్‌‌‌‌రావు ఆరోపణలన్నీ పచ్చి అబద్ధం, నిరాధారమైనవి. ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతివ్వలేదు. ప్రాజెక్టుపై స్టాండ్‌‌‌‌ను చెబుతూ ఈ నెల 4న లేఖ కూడా రాసింది. పీఎఫ్‌‌‌‌ఆర్​కు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఆ లేఖలో స్పష్టం చేసింది’’ అని ఉత్తమ్‌‌‌‌ పేర్కొన్నారు. 

అసెంబ్లీలో చెక్‌‌‌‌పెట్టేలా..
కృష్ణా జలాల అంశంపై బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌కు గట్టి కౌంటర్​ ఇచ్చేలా ఇరిగేషన్​ శాఖ సిద్ధమవుతున్నది. జనవరి 2న అసెంబ్లీలో పవర్​పాయింట్​ ప్రజెంటేషన్ ఇవ్వనున్న నేపథ్యంలో.. ప్రతి అంశాన్నీ మంత్రి ఉత్తమ్​ లోతుగా తెలుసుకుంటున్నారు. మంగళవారం జలసౌధలో ఉన్నతాధికారులతో ఉత్తమ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి కీలక రివ్యూ చేశారు. ఏ ఒక్క చిన్న పొరపాటు కూడా జరగడానికి వీల్లేదని అధికారులకు తేల్చి చెప్పారు. 

కృష్ణాలో తెలంగాణ రాకముందు ఇచ్చిన నీళ్లు.. ఆయకట్టు వివరాలతోపాటు గత బీఆర్ఎస్​ పదేండ్ల పాలనలో ఇచ్చిన ఆయకట్టు, నీటి వాడకం వివరాలను సేకరిస్తున్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్​ విషయంలో తప్పు ఎవరు చేశారో చూపించేలా ఆధారాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధికారులు తయారు చేస్తున్న పీపీటీలను మంత్రి ఉత్తమ్​ పరిశీలించినట్టు తెలిసింది.