హైదరాబాద్, వెలుగు: కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం రాష్ట్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రం నుంచి రావాల్సిన దాదాపు3 వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయాలని ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ కేంద్రానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రం నుంచి కొన్ని అంశాలపై కేంద్రం క్లారిటీ అడిగినట్టు తెలిసింది.
గతంలో పంచాయతీలకు విడుదల చేసిన నిధులకు సంబంధించి గ్రాంట్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(జీటీసీ) సమర్పించడంతోపాటు గతంలో మంజూరై.. ఖర్చు చేయని దాదాపు రూ.273 కోట్ల ఆర్థిక సంఘం నిధులపై వివరణ కోరింది. గడువులోగా పంచాయతీలకు చెల్లించని ఈ మొత్తానికి వడ్డీ చెల్లించాలని కోరినట్టు సమాచారం.
ఆర్థిక సంఘం నిధులు మంజూరైన పదిరోజుల్లో పంచాయతీలకు కేటాయించాలని.. లేదంటే వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పీఆర్ ఆఫీసర్లు చెప్తున్నారు. దీంతో కేంద్రం అడిగిన వివరాలను పంచాయతీరాజ్‌శాఖ రెడీ చేసి మంగళవారం పంపించినట్టు తెలిసింది.
