ఇదీ హైదరాబాద్ కమిషనరేట్.. 7 జోన్లు, 26 డివిజన్లు,72 పోలీస్ స్టేషన్లు

ఇదీ హైదరాబాద్ కమిషనరేట్.. 7 జోన్లు, 26 డివిజన్లు,72 పోలీస్ స్టేషన్లు
  • సైబరాబాద్​లో 3 జోన్లు, 22 పీఎస్​లు, మల్కాజిగిరి పరిధిలో 4 జోన్లు, 30 పీఎస్​లు
  • ఫ్యూచర్​సిటీలో మూడు జోన్లు, 22 పీఎస్​లు
  • ప్రతిపాదిత  మ్యాపులు విడుదల

హైదరాబాద్​సిటీ/ ఇబ్రహీంపట్నం, వెలుగు: జీహెచ్ఎంసీలో 27 శివారు లోకల్ ​బాడీలను విలీనం చేసిన సర్కారు.. అంతే వేగంగా మూడు పోలీస్​ కమిషనరేట్లను పునర్​వ్యవస్థీకరించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా ఫ్యూచర్​సిటీ పేరిట కొత్త కమిషనరేట్​నూ ఏర్పాటు చేసింది. ఇంతకు ముందున్న హైదరాబాద్, సైబరాబాద్​ కమిషనరేట్ల పేరును అలాగే ఉంచిన సర్కారు.. రాచకొండ కమిషనరేట్ పేరును మల్కాజిగిరిగా మార్చింది. 

ఇంతకుముందు దీనికి కమిషనర్​గా ఉన్న సుధీర్​బాబును ఫ్యూచర్​సిటీ కమిషనర్​గా పంపి.. మల్కాజిగిరికి సైబరాబాద్​సీపీ అవినాశ్​మహంతీని బదిలీ చేసింది. సైబరాబాద్​స్థానం ఖాళీ కావడంతో రమేశ్​రెడ్డికి  బాధ్యతలు అప్పజెప్పింది. మంగళవారం వీరంతా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో పోలీస్​కమిషనరేట్ల పరిధిలోకి వచ్చే జోన్లు, డివిజన్లు, పోలీస్​స్టేషన్ల వివరాలకు సంబంధించిన ప్రతిపాదిత మ్యాపులు విడుదల చేశారు. చివరలో ఏమైనా చిన్న చిన్న మార్పులు మాత్రమే ఉండవచ్చని , లేనిపక్షంలో ఇలాగే ఉండే అవకాశం ఉంటుందంటున్నారు.  

హైదరాబాద్లో ఇలా..
హైదరాబాద్​కమిషనరేట్​పరిధిలో 7 జోన్లు, 26 డివిజన్లు, 72 పోలీస్​స్టేషన్లను చేర్చారు. ఇంతకుముందున్న చార్మినార్, గోల్కొండ, ఖైరతాబాద్​–1, ఖైరతాబాద్​–2, సికింద్రాబాద్​కు అదనంగా రాజేంద్రనగర్, శంషాబాద్​జోన్లను జత చేశారు. 

రాజేంద్రనగర్​పరిధిలో రాజేంద్రనగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్​నుమా డివిజన్లు.., చాంద్రాయణగుట్ట డివిజన్​లో చాంద్రాయణగుట్ట, బండ్లగూడ, కంచన్​బాగ్​, మైలార్​దేవ్​పల్లి పీఎస్​లను.., ఫలక్​నుమా డివిజన్​లో కామాటిపురా, ఫలక్​నుమా, బహదూర్​పురా, కాలాపత్తర్​పోలీస్​స్టేషన్లను..,అలాగే, రాజేంద్రనగర్​ డివిజన్​లో  అత్తాపూర్​, రాజేంద్రనగర్​పీఎస్​లను చేర్చారు. 

శంషాబాద్ ​జోన్​ విషయానికి వస్తే ఇందులో ఆదిబట్ల, ఆర్జీఐఏ( రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ఎయిర్​పోర్ట్​) డివిజన్లను పొందుపర్చి ..ఆదిబట్ల డివిజన్​లో ఆదిబట్ల, బాలాపూర్​, బడంగ్​పేట పీఎస్​లను, ఆర్జీఐఏ పరిధిలో పహడీ షరీఫ్, ఆర్జీఐఏ పోలీస్​స్టేషన్లను చేర్చారు. 

సైబరాబాద్, మల్కాజిగిరి పరిధిలో..
సైబరాబాద్​పరిధిలో 3 జోన్లు, 7 డివిజన్లు, 22 పోలీస్​స్టేషన్లను చేర్చారు. ఇందులో శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్​జోన్లున్నాయి. శేరిలింగంపల్లి పరిధిలో ఆర్సీపురం, నార్సింగి డివిజన్లు.., కూకట్​పల్లిలో కేపీహెచ్​బీ, బాలానగర్​, మాదాపూర్​డివిజన్లు.., కుత్బుల్లాపూర్​జోన్​లో మేడ్చల్, కుత్బుల్లాపూర్​డివిజన్లు ఉన్నాయి. ఇక మల్కాజిగిరి కమిషనరేట్​(పాత రాచకొండ కమిషనరేట్)పరిధిలో ఎల్బీనగర్, మల్కాజిగిరితో పాటు అదనంగా బేగంపేట్, ఉప్పల్​జోన్లు ఉన్నాయి. ఈ కమిషనరేట్​లో మొత్తంగా 4 జోన్లు, 10 డివిజన్లు, 30 పోలీస్​స్టేషన్లు ఉన్నాయి.  

ఫ్యూచర్​సిటీకి 22 పోలీస్​స్టేషన్లు 
ఫ్యూచర్​సిటీ కమిషనరేట్ ను రంగారెడ్డి కలెక్టరేట్​లోని ఫస్ట్ ఫ్లోర్​లో తాత్కాలికంగా ఏర్పాటు చేయగా, 3 జోన్లు, 6 ​డివిజన్లు,22 పీఎస్​లు ఉన్నాయి.  షాద్ నగర్, మహేశ్వరం, మొయినా బాద్ జోన్లు రానున్నాయి. అలాగే, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, చేవెళ్ల, మొయినాబాద్, ఆమన్ గల్, షాద్ నగర్ డివిజన్లలోని 22 పోలీస్​స్టేషన్లు ఈ కమిషనరేట్​లో పని చేయనున్నాయి. 

ఇబ్రహీంపట్నం పరిధిలోని పీఎస్​లలో ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, కడ్తాల్​.., మహేశ్వరం పరిధిలో కందుకూరు, మహేశ్వరం, ఫార్మాసిటీ పోలీస్​స్టేషన్లు..,చేవెళ్ల పరిధిలో చేవెళ్ల, మోకిల, శంకర్​పల్లి పీఎస్​లు..,మొయినాబాద్ పరిధిలో మొయినాబాద్, షాబాద్, శంషాబాద్ పోలీస్​స్టేషన్లు రానున్నాయి. అలాగే, ఆమనగల్​లో ఆమనగల్,  కేశంపేట్, మాడ్గుల, తలకొండపల్లి ఉన్నాయి. షాద్​నగర్​లో చౌదరిగూడెం, కొందుర్గ్, కొత్తూర్, నందిగామ, షాద్ నగర్ ఉన్నాయి.