జగిత్యాల రూరల్, వెలుగు: గ్రామాల అభివృద్ధిలో పంచాయతీ పాలకవర్గాల పాత్ర కీలకమని, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన గౌడ కులస్తుల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం మంగళవారం జిల్లాకేంద్రంలో జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా అడ్లూరి మాట్లాడుతూ గౌడ కులస్తులు స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడం వారి ఐక్యత, సామాజిక చైతన్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్నివర్గాల అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తోందన్నారు. కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు గ్రామాల్లో తాగునీరు, రోడ్లు, శానిటేషన్, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనంతరం వారిని సన్మానించారు.
