వేములవాడలో మహా శివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేయాలి : విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్

వేములవాడలో మహా శివరాత్రికి ఘనంగా ఏర్పాట్లు చేయాలి : విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగ్రవాల్

వేములవాడ, వెలుగు: మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తులకు అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఘనంగా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జాతర చైర్ పర్సన్, ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో మహా శివరాత్రి జాతర నేపథ్యంలో వేములవాడలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం జాతర సమన్వయ సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే రోడ్లకు రిపేర్లు, రద్దీకి అనుగుణంగా బస్సులు సిద్ధం చేయాలన్నారు. బస్టాండ్‌‌లో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని, హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శానిటేషన్‌‌ పనులకు యాక్షన్ ప్లాన్‌‌, అన్ని వివరాలతో కూడిన సైన్ బోర్డులు పెట్టించాలన్నారు. జాతర ఆవరణలో ప్లాస్టిక్ వస్తువులు వినియోగించకుండా చూడాలన్నారు. 

ఎస్పీ మహేశ్ బి.గీతే మాట్లాడుతూ ట్రాఫిక్‌‌కు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జాతరకు వచ్చే భక్తులకు రక్షణ కల్పిస్తామని,  వీఐపీల దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని వివరించారు. ఈ సమావేశంలోఅడిషనల్‌‌ కలెక్టర్ నగేశ్‌‌, ఏఎస్పీ రుత్విక్ సాయి, ఆర్డీవో రాధాబాయి, ఈవో రమాదేవి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ నిఖిత తదితరులు పాల్గొన్నారు. 

ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం సందర్శన 

మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఇన్‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆదేశించారు. వేములవాడ పట్టణంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల విద్యాలయం(మానాల)ను ఆమె సందర్శించారు. టీచర్ల హాజరు రిజిస్టర్, స్టోర్ రూమ్ లో ఆహార సామగ్రి, కోడి గుడ్లు, కూరగాయలు, విద్యార్థుల కోసం సిద్ధం చేసిన ఆహార పదార్థాలను పరిశీలించారు. మెనూ ప్రకారం చికెన్, మటన్, కోడి గుడ్లు ఇస్తున్నారా అని ఆరా తీశారు.