ప్రాజెక్టులపై ప్రభుత్వం నిర్లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్‌‌రావు లెటర్‌‌

ప్రాజెక్టులపై  ప్రభుత్వం నిర్లక్ష్యం: మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌రెడ్డికి ఎమ్మెల్యే హరీశ్‌‌రావు లెటర్‌‌

సిద్దిపేట, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన అన్నపూర్ణ, రంగనాయకసాగర్, కొమురవెల్లి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్‌‌ రిజర్వాయర్లను కాంగ్రెస్‌‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డికి హరీశ్‌‌రావు లెటర్‌‌ రాశారు.

కొత్తగా నిర్మించిన రిజర్వాయర్ల ద్వారా సిద్దిపేట జిల్లాలో సుమారు లక్ష ఎకరాల కొత్త ఆయకట్టు పెరిగిందన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రతీ యాసంగిలో కాలువల ద్వారా చెరువులు, కుంటలు, వాగులు, చెక్‌‌డ్యామ్‌‌లుతో ఆయకట్టుకు నీళ్లు అందించామని లెటర్‌‌లో వివరించారు. 

కాంగ్రెస్‌‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లా ప్రాజెక్టులకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని, ఒక్క గజం కాలువ కూడా తవ్వలేదన్నారు. మైనర్‌‌, సబ్‌‌మైనర్‌‌ కాల్వల నిర్మాణానికి భూసేకరణ చేపట్టాలని పలుమార్లు లెటర్లు రాసినా, ఫోన్లు చేసినా, వ్యక్తిగతంగా కలిసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా.. అన్నపూర్ణ రిజర్వాయర్ ప్యాకేజ్-10కి రూ.15 కోట్లు, రంగనాయకసాగర్‌‌ ప్యాకేజీ 11 కోసం రూ.15 కోట్లు కేటాయించాలని లేఖలో కోరారు.