
స్వీట్ లవర్స్ చాలామందికి హల్వా అంటే మస్తు ఇష్టం. ఎందుకు అంత ఇష్టం? అంటే ఇట్ల నోట్ల పెట్టుకుంటే అట్ల కరిగిపోతది అంటరు. డ్రైఫ్రూట్స్ తో చేస్తరు. మస్తు టేస్ట్ ఉంటది. స్వీట్ షాపుల్లో దొరుకుతాయి. అయితే పండుగ వేళ మస్తు మస్తు హల్వాను ఇంట్లనే వండుకోవచ్చు. రొటీన్ గా బ్రెడ్ హల్వాకాకుండా బాంబే హల్వా, ఓట్స్ హల్వా లాంటివి కూడా చేసుకోవచ్చు. మరింకెందుకు ఆలస్యం ఆ రెసిపీలేందో జల్దీ చూసేయండి.
బాదం హల్వా
కావాల్సినవి:
బాదం: ఒక కప్పు;
చక్కెరః కప్పు;
పాలు: 2 కప్పులు;
నెయ్యి: కప్పు
కుంకుమపువ్వు కొద్దిగా
తయారీ..
బాదంపప్పు నానబట్టి పొట్టు తీసి రుబ్బుకోవాలి. 2 టీస్పూన్ల నెయ్యిని మందపాటి ప్యాన్ పైన అప్లై చేయాలి. అరకప్పు నీళ్లుపోసి మరిగించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చక్కెర వేసి కరిగించాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న బాదం ముద్ద, పాలు, కుంకుమపువ్వు ఆ నీటిలో వేసి కలుపుతూ ఉడికించుకోవాలి.. అదంతా దగ్గరపడి ముద్దలా అయ్యాక నెయ్యి వేసి మరో పదినిమిషాలపాటు సిమ్లో ఉడికించాలి. నెయ్యి పైకి వచ్చాక స్టవ్ ఆఫ్చేసి మిగిలిన నెయ్యిని వేసి కలపాలి. కాస్త చల్లారాక మనకు కావాల్సిన ఆకారంలో ముక్కలుగా కోసుకుంటే బలేగా ఉండే బాదం హల్వా రెడీ అవుతుంది.
బాంబే హల్వా
కావాల్సినవి:
బొంబాయి రవ్వ, కప్పు
చక్కెర: కప్పు
నెయ్యి: ఒకటిన్నర కప్పు
సిట్రిక్ యాసిడ్: పావు టీస్పూన్
బాదంపప్పు: అరకప్పు
పిస్తా: పావుకప్పు
యాలకులపొడి: అర టీస్పూన్
కుంకుమపువ్వు: తగినంత
తయారీ..
బొంబాయి రవ్వను బాగా కడిగి 3 గంటలపాటు నానబెట్టాలి. బాదంపప్పును కూడా అరగంట పాటు నానబెట్టి.. ఆ తర్వాత పొట్టు తీసి ఉంచుకోవాలి. నీటిని వంపేసి, రవ్వను మిక్సీలో వేసి వేడినీళ్లు పోస్తూ రుబ్బుకోవాలి. మందపాటి కడాయి పెట్టి కప్పునెయ్యి వేడిచేసి దాన్ని చల్లార్చాలి. ఆ తర్వాత మెత్తగా రుబ్చిన రవ్వను వేసి నిదానంగా కలుపుతూ ఉడికించాలి.. ఉడికేటప్పుడు మిగిలిన నెయ్యిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోవాలి. మిశ్రమం చిక్కబడ్డాక చక్కెర వేసి మళ్లీ కలుపుతూ ఉడికించాలి. నెయ్యి బయటికి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సిట్రిక్ యాసిడ్, పిస్తా, బాదం పలుకులు, కుంకుమపువ్వు వేసి కలపాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ట్రేలో వేసి చల్లారాక ముక్కలుగా కోసుకోవాలి. అంతే.. మెత్తని బాంబే హల్వా రెడీ.