- జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ
- ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించిన రిటర్నింగ్ అధికారులు
- రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి ఎన్నికలు
హైదరాబాద్/ఎల్ బీ నగర్, వెలుగు: తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (టీజీవో) ప్రెసిడెంట్ గా ఏలూరి శ్రీనివాస రావు, జనరల్ సెక్రటరీగా సత్యనారాయణ ఎన్నికయ్యారు. మంగళవారం ఎల్ బీ నగర్ లోని ఓ ఫంక్షన్ లో జరిగిన ఎన్నికల్లో వీరు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు రిటర్నింగ్ ఆఫీసర్లు రవి (డిప్యూటీ కలెక్టర్), సంపత్ కుమార్ (అసిస్టెంట్ కమిషనర్ ప్రకటించారు. వీరితో పాటు వైస్ ప్రెసిడెంట్ గా జగన్ మోహన్ రావు, ట్రెజరర్ గా ఉపేందర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా పరమేశ్వర్ రెడ్డి, మహిళా ప్రతినిధిగా దీపా రెడ్డి, ఈసీ మెంబర్ గా యాదగిరి ఎన్నికయ్యారు. రవీందర్ రావు, పురుషోత్తం రెడ్డి, సురేశ్‌ను సలహాదారులుగా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా రామకృష్ణ గౌడ్, వర్కింగ్ మెంబర్ గా యాదగిరి గౌడ్ ను ఎన్నుకున్నారు.
ఎన్నిక పూర్తయిన తర్వాత కొత్త కమిటీ నాంపల్లిలోని టీజీవో భవన్ లో సమావేశమైంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను క్షేత్ర స్థాయిలో అమలు చేసి సర్కారుకు మంచి పేరు తెచ్చేందుకు కృషి చేస్తామని అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏలూరు శ్రీనివాస రాజు, సత్యనారాయణ తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి, ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి పెండింగ్ డీఏలు, పీఆర్సీ, 317 జీవో సవరణ, సీపీఎస్ రద్దు, ఈహెచ్ ఎస్ స్కీమ్ పై నిర్ణయం తీసుకోవాలని కోరుతామన్నారు. లోక్‌సభ షెడ్యూల్ రానున్న నేపథ్యంలో స్టేట్ కమిటీకి మాత్రమే ఎన్నికలు జరిగాయని వివరించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 33 జిల్లాలకు, హైదరాబాద్ సిటీకి ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు.
రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారి ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక టీజీవో అసోసియేషన్‌కు తొలిసారి ఎన్నికలు జరిగాయని గెజిటెడ్ ఉద్యోగులు చెప్తున్నారు. పదేండ్లు ఓ మాజీ మంత్రి, ఓ మహిళా ఉన్నతాధికారి నిబంధనలకు విరుద్ధంగా అసోసియేషన్ నడిపినట్టు ఆరోపించారు. తమకు అనుకూలంగా ఉన్నవారిని స్టేట్, జిల్లా కమిటీల్లో నియమించుకున్నారని విమర్శించారు. ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోలేదని తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 12,500 మంది గెజిటెడ్ అధికారులు ఉండగా.. ఇప్పటి వరకు 9వేల మందికి మాత్రమే మెంబర్షిప్ ఇచ్చారు. మిగిలిన వారందరికీ త్వరలో సభ్యత్వాలు ఇస్తామని యూనియన్ సభ్యులు తెలిపారు.
ఎన్నికల్లో గందరగోళం
ఎల్ బీ నగర్ లో జరిగిన టీజీవో ఎన్నికల్లో జిల్లాల నుంచి వచ్చిన ఉద్యోగులు నిరసన చేపట్టారు. తమ నామినేషన్లు తీసుకోకుండా కొంత మంది టీజీవోలు ఏకగ్రీవం కోసం ప్రయత్నించారని ఆరోపించారు. రూమ్ లాక్ చేసుకుని ఈ ప్రక్రియ చేపట్టారని విమర్శించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు అవకాశం ఇవ్వలేదని, తాము కూడా పోటీ చేస్తామని చెప్పినా పట్టించుకోలేదన్నారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఉద్యోగులకు నచ్చజెప్పారు. రాష్ట్ర స్థాయి పదవులు మాత్రమే ఏకగ్రీవం అయ్యాయని, జిల్లా స్థాయిలో అవకాశం ఇస్తామని టీజీవో అధికారులు సముదాయించడంతో ఉద్యోగులు శాంతించారు.
