- రూ.65 కోట్లతో ఎర్రగట్టుగుట్ట నుంచి అంబాల మీదుగా పరకాల వరకు రోడ్డు అభివృద్ధి
- కంఠాత్మకూరు బ్రిడ్జి పరిస్థితి కూడా అంతే..
- రోడ్డు సరిగా లేక నిత్యం అవస్థలు పడుతున్న వాహనదారులు
హనుమకొండ, పరకాల, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పరకాల పట్టణానికి కనెక్టివిటీ పెంచేందుకు చేపట్టిన ఫోర్ లేన్ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. గతంలో ఉన్న రోడ్డును విస్తరించేందుకు ఫోర్ లేన్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టగా, ఏడాది అవుతున్నా ఎక్కడిపనులక్కడే ఉండిపోయాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము, ధూళితోపాటు గుంతలతో నిత్యం నరకం చూస్తున్నామని వాపోతున్నారు.
28 కిలోమీటర్లు.. రూ.65 కోట్లు
వరంగల్ నగరం నుంచి భూపాలపల్లి వైపు వెళ్లాల్సిన వాహనాలు పరకాల మీదుగానే వెళ్తుంటాయి. కాగా, హనుమకొండ నుంచి పరకాల వెళ్లేందుకు గుడెప్పాడ్ నుంచి ఒక రూట్ ఉండగా, ఎర్రగట్టుగుట్ట నుంచి అంబాల మీదుగా ఇంకో మార్గం ఉంది. ఎర్రగట్టుగుట్ట నుంచి అంబాల మీదుగా పరకాలకు టూవీలర్స్, ఆటోలు, కార్లు, బస్సులు ఇలా నిత్యం వేలాది వెహికల్స్ రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాలో ముఖ్యమైన రోడ్లలో ఇదొక్కటి కాగా, దాదాపు 28 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఈ రోడ్డు గుంతలతో చాలా వరకు డ్యామేజ్ అయ్యింది. అడపాదడపా ప్యాచ్ వర్క్స్ చేయిస్తున్నా కొద్దిరోజులకే మళ్లీ గుంతలు ఏర్పడి కష్టాలు మొదలవుతున్నాయి. హనుమకొండ– అంబాల– పరకాలకు కనెక్టివిటీ పెంచడంతోపాటు దూర భారం తగ్గించేందుకు ఈ రోడ్డును ఫోర్ లేన్ గా డెవలప్ చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి చొరవ చూపారు. ఈ మేరకు గతేడాది నవంబర్ లో రూ.65 కోట్లతో పనులకు శంకుస్థాపన చేశారు. .
ఏడాది అవుతున్నా ఎక్కడిపనులక్కడే..
ఎర్రగట్టుగుట్ట– పరకాల రోడ్డును ఫోర్ లేన్ గా డెవలప్ చేసే పనులకు శ్రీకారం చుట్టడంతో ఈ మార్గంలో ప్రయాణ కష్టాలు తీరినట్టేనని అంతా భావించారు. కానీ, పనులు స్టార్ట్ చేసి ఏడాది అవుతున్నా ఇంతవరకు కొలిక్కిరాలేదు. దారి పొడవునా ఉన్న భారీ వృక్షాలను తొలగించి, పనులు చేపట్టగా, ఇప్పటికీ ఎక్కడి పనులక్కడే మూలుగుతున్నాయి. గూనిపర్తి అవతలి నుంచి ధర్మారం వరకు ఫోర్ లైన్ రోడ్డుకు మట్టి పోసి వదిలేయగా, దుమ్ము, ధూళితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
డెడ్ స్లోగా కంఠాత్మకూరు బ్రిడ్జి..
అంబాల మీదుగా పరకాల వెళ్లే రూట్ లో కంఠాత్మకూరు వద్ద ఉన్న లో లెవల్ బ్రిడ్జితో తీవ్ర సమస్యలు ఎదురయ్యేవి. కొద్దిపాటి వాన పడినా లో లెవల్ వంతెనపైనుంచి వరద ప్రవహించి ఈ మార్గంలో రాకపోకలు నిలిచిపోయేవి. ప్రత్యామ్నాయంగా కంఠాత్మకూరు నుంచి మల్లారెడ్డిపల్లి మీదుగా హనుమకొండకు వెళ్లాల్సి వచ్చేది. దీంతోనే ఫోర్ లేన్ డెవలప్మెంట్ లో భాగంగా కంఠాత్మకూరు వద్ద రూ.10 కోట్లతో హై లెవల్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ పనులు షురూ చేసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు పూర్తి కాకపోవడంతో ప్రజల ప్రయాణానికి ఇబ్బందులు తప్పడం లేదు.
మేడారం జాతర తర్వాతనే..!
పరకాల ఫోర్ లైన్ వర్క్స్ చేపట్టిన కాంట్రాక్టర్ మేడారం జాతరకు సంబంధించిన పనులను దక్కించుకున్నట్లు తెలిసింది. దీంతో ముందుగా మేడారం పనులపై నిమగ్నమై పరకాల రోడ్డు పనులు అర్ధాంతరంగానిలిపేసినట్లు తెలుస్తోంది. మేడారంలో చేపట్టిన పనులు పూర్తయితేనే ఈ రోడ్డు పనులు రీస్టార్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇదిలాఉంటే ఈ రూట్ లోని గ్రామాల ప్రజలకు మేడారం జాతర వెళ్లాలంటే ఈ రోడ్డే దిక్కు. దీంతో నిలిచిపోయిన పనుల వల్ల ఈ రోడ్డు గుండా మేడారం వెళ్లే జనాలకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికైనా ఎర్రగట్టుగుట్ట నుంచి అంబాల మీదుగా పరకాల వరకు చేపట్టిన ఫోర్ లేన్ విస్తరణ పనులను స్పీడప్ చేయాలని, మేడారం జాతరలోగా పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని వాహనదారులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
