మంచం పట్టిన కన్నెపల్లి..ప్రైవేట్ ట్రీట్మెంట్ కు అధికారుల అడ్డు

మంచం పట్టిన కన్నెపల్లి..ప్రైవేట్ ట్రీట్మెంట్ కు అధికారుల అడ్డు
  • ఊరంతా విషజ్వరాలతో జనాలు విలవిల
  • పూర్తి స్థాయిలోఅందని సర్కారు వైద్యం
  • ఇప్పటికే ఇద్దరి మృతి.. గ్రామస్తుల ఆందోళన

మంచిర్యాల/చెన్నూర్, వెలుగు:  ఎండాకాలంలో విష జ్వరాలతో మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం కన్నెపల్లి గ్రామం నెల రోజులుగా వణికిపోతోంది. 300 జనాభా ఉన్న  గ్రామంలో ఏ ఇంట్లో చూసినా మంచం పట్టి ప్రజలు అల్లాడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మృతి చెందడం గ్రామంలో విషాదాన్ని నింపింది. మరోవైపు ప్రభుత్వ వైద్యం సరైన రీతిలో అందకపోగా... ప్రైవేట్ వైద్యం తీసుకునేందుకు అధికారులు అడ్డుపడడం మరింత ఇబ్బందికరంగా మారింది. 

ఇంటికో కథ... 

కన్నెపల్లి లో  ఇటీవల కాలంలో గ్రామానికి చెందిన లంకల రవికుమార్ కు జ్వరం రాగా చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అక్కడ జ్వరం తగ్గకపోవడంతో మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. జ్వరం తగ్గినప్పటికీ రూ.80 వేల బిల్లు కావడం గమనార్హం. ఒక్కరికి రూ.80 వేలు ఖర్చు అయితే ఒకే ఇంట్లో ముగ్గురు, నలుగురికి జ్వరం వస్తే లక్షల రూపాయలు ఎక్కడి నుంచి తెచ్చేదని గ్రామస్తులు వాపోతున్నారు.    ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తున్న టెస్టులు సరైనవి కావని ప్రభుత్వ వైద్య సిబ్బంది చెబుతున్నారని, ఆర్ఎంపీలు  వైద్యసేవలు అందించేందుకు వస్తే వారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది నామమాత్రంగా గోలీలు , సెలైన్లు పెట్టి చేతులు దులుపుకోవడం తప్పా సరైన వైద్యం చేయడం లేదని మండిపడుతున్నారు. ఏదైనా ఇబ్బంది ఉంటే మంచిర్యాలలోని జిల్లా హాస్పిటల్ కు వెళ్లాలని చెబుతున్నారని వాపోతున్నారు. 

అవే ప్రధాన సమస్యలు 

కన్నెపల్లికి రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి. చెన్నూరు పట్టణానికి సంబంధించిన డంపింగ్ యార్డ్ ఊరికి సమీపాన నిర్మించడం వల్ల పట్టణంలో చనిపోయిన జంతు కళేబరాలను ఈ డంపింగ్ యార్డ్ లో తీసుకొచ్చి పడేస్తున్నారు. దుర్వాసన రావడంతో పాటు ఊర్లో ఉన్న కుక్కలు డంపింగ్ యార్డ్ నుంచి మృతదేహాలను గ్రామ సమీపంలోకి తీసుకువచ్చి తింటున్నాయి. రోజు సాయంత్రం చెత్తను కాలపెట్టడం వల్ల వెలువడే వాసన వల్ల కూడా ఈ వ్యాధులు వస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. వాగు నీళ్లు తాగడం కూడా ఒక కారణమనే అనుమానాలు ఉన్నాయి.  డెంగీ , సహా విషజ్వరాలు సోకినట్లు తెలుస్తున్నా ప్రభుత్వ వైద్యులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.  వాటర్ టెస్ట్, ఇతర టెస్ట్లు చేయడం లేదని మండిపడుతున్నారు.  శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. 39 మందికి టెస్టులు చేయగా ఏడుగురికి జ్వరం ఉన్నట్లుగా గుర్తించి వారిని 108 అంబులెన్స్ లో చెన్నూర్ హాస్పిటల్ కు తరలించారు.   

హాస్పిటల్ లో ఉంటూ అంత్యక్రియలు చేశాం...

మా ఇంట్లో నలుగురికి జ్వరం వచ్చింది. అందరం చెన్నూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో 5 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నా తగ్గలేదు.  గవర్నమెంట్ దవాఖానకు పోతే ఎట్లుంటదో అని ప్రైవేటుకు వెళ్లినం. మా ముగ్గురికి సుమారుగా 2 లక్షల ఖర్చు వచ్చింది. మా అమ్మ మాకు హాస్పిటల్ లో సేవలు చేయడం వల్ల ఆమెకు జ్వరం వచ్చి ఈ నెల 9న చనిపోయింది. అంత్యక్రియలు చేసి అదే రోజు మంచిర్యాల వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నాం. 

పల్లె రవికుమార్          

అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాం 

కన్నెపల్లిలో ప్రస్తుతం  వైరల్ ఫీవర్ మాత్రమే వస్తోంది. ఎండవేడి పెరగడంతో ఈ సమస్య వచ్చింది. డెంగీ, డయేరియాలాంటి లక్షణాలు లేవు. ప్రైవేట్ ల్యాబ్ రిపోర్టులను నమ్మి ప్రజలు మోసపోవద్దు. 

 డాక్టర్ సుబ్బరాయుడు , డీఎంహెచ్ ఓ