వంద కోట్లు తెమ్మని హోంమంత్రే చెప్పారు

వంద కోట్లు తెమ్మని హోంమంత్రే చెప్పారు
  • సీఎం ఉద్దవ్ థాక్రేకు ముంబై మాజీ పోలీసు కమిషనర్ లేఖ

ముంబై:మహారాష్ట్ర హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ దేశ్ ముఖ్ పై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో కొద్ది రోజుల క్రితం బదిలీ అయిన ఈయన స్వయంగా సీఎంకు లేఖ రాయడం మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.  అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు వ్యవహారంలో విచారణ సరిగా చేయడంలేదంటూ హోంగార్డు కమాండెంట్ గా పరంబీర్ సింగ్ ను బదిలీ చేశారు. కాగా తన బదిలీ సాధారణ పరిపాలన వ్యవహారాల్లో భాగంగా జరిగినట్లు చెప్పుకున్నా.. అసలు విషయం మాత్రం హోం మంత్రి నిర్దేశించిన వసూళ్ల దందానే కారణమని.. అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం విషయంలో అరెస్టయిన వాజేను నెలకు 100 కోట్లు తెమ్మని హోం మంత్రి ఒత్తిడి చేశారని.. మంత్రి చెప్పినసమయంలో ఆయన అనుచరులు కూడా అక్కడే ఉన్నారని పరంబీర్ సింగ్ పేర్కొన్నారు. తన టీమ్ లో ముంబై క్రైం ఇంటలిజెన్స్ యూనిట్ హెడ్ గా పనిచేస్తున్న వాజేను పిలిపించుకుని బార్లు, పబ్బులు, హుక్కా సెంటర్ల నుండి నెలకు వంద కోట్లు వసూలు చేసి తీసుకురావాలని మంత్రి ఒత్తిడి చేశారని.. ఈ విషయం ఆయన బహిరంగంగా అనుచరుల ముందే చెప్పాడని ఆరోపించారు. ఈ మేరకు 8 పేజీల లేఖను సీఎం ఉద్దవ్ థాకరేకు పంపడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేస్ ఈ వ్యవహారంపై సీఎం ఉద్దవ్ థాకరే ఇంకా స్పందించలేదు. మహారాష్ట్ర లో దుమారం రేపుతున్న వ్యవహారంపై కేంద్ర హోం శాఖ దృష్టి సారిస్తుందా అన్నది.. ఉత్కంఠ రేపుతోంది.