ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్​ జిల్లాల్లో 70 చోట్ల జాతరలు  

ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్​ జిల్లాల్లో 70 చోట్ల జాతరలు  

కరీంనగర్, వెలుగు: ఒకప్పుడు సమ్మక్క జాతర అంటే మొదటికి (మేడారం) పోవుడే. కానీ మేడారంలో రద్దీ, ట్రాఫిక్​ జామ్​లు, ఇతర  సమస్యలు, వ్యయ, ప్రయాసల కారణంగా ఎక్కడికక్కడ జాతరలు మొదలయ్యాయి. మొదట్లో మేడారం బయట నాలుగైదు చోట్ల మాత్రమే జాతరలు జరిగేవి. కానీ కొన్నేండ్లుగా ఇలాంటి జాతరల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్  జిల్లాల్లో ఏం తక్కువ 70 చోట్ల  జాతరలు నిర్వహిస్తున్నారు. ఆయా చోట్ల ఈసారి 30 లక్షల మందికి పైగా భక్తులు మొక్కులు చెల్లించుకుంటారని భావిస్తున్నారు. 

మినీ మేడారాలను తలపిస్తయ్.. 

అఫీషియల్​ లెక్కల ప్రకారం ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్  జిల్లాల్లో 70 చోట్ల  సమ్మక్క  జాతరలు జరుగుతాయి. వీటిలో చాలామటుకు ఆయా గ్రామాలకు పరిమితమయ్యే చిన్న జాతరలు కాగా, కరీంనగర్ జిల్లాలోని రేకుర్తి, హుజూరాబాద్ సమీపంలోని రంగనాయకుల గుట్ట, శంకరపట్నం, వీణవంక, పెద్దపల్లి జిల్లాలోని నీరుకుల్ల,  గోదావరిఖని, మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, మందమర్రి, తంగళ్లపల్లి మండలంలోని ఓబులాపురం పెద్ద జాతరలు. వీటిని స్థానికంగా మినీ మేడారాలు అని పిలుస్తారు. చిన్న జాతరలను ఆయా గ్రామకమిటీల ఆధ్వర్యంలో నిర్వహిస్తుండగా, పెద్ద జాతరలను అధికారులు అఫీషియల్​గా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఈవోలను జాతరలకు ఇన్ చార్జీలుగా నియమించారు. వాళ్ల ఆధ్వర్యంలోనే  గద్దెలకు రంగులు వేయడం, క్యూలైన్ల ఏర్పాటు, భక్తులకు డ్రింకింగ్​ వాటర్,​  టెంపరరీ స్నానాల గదులు, టాయిలెట్స్,​ ఇతర ఫెసిలిటీస్​ కల్పిస్తున్నారు. ఈ మినీ మేడారాల్లో అమ్మలను గద్దెల మీదికి తేవడం మొదలు అన్ని పూజా కార్యక్రమాలను అచ్చం మేడారంలో మాదిరే నిర్వహించడం విశేషం.