వర్ధన్నపేట, వెలుగు: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందని, దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటుపై మాట్లాడుతూ పదేండ్లు దోచుకున్న సొమ్ముతో వచ్చిన విభేదాలతోనే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరు బయటకు వచ్చి కొత్త పార్టీలు పెడుతున్నారని ఆరోపించారు.
కవిత ఏర్పాటు చేసిన పార్టీ కేసీఆర్ వ్యూహంలో భాగమేనని, రాష్ట్రంలో బీఆర్ఎస్కు భవిష్యత్తు లేదన్నారు. కార్యక్రమంలో డీసీవో నీరజ, సొసైటీ ఇన్చార్జి కీరునాయక్, మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, కమిషనర్ జోనా తదితరులు పాల్గొన్నారు. మండల పరిధిలోని వెంకట్రావుపల్లిలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని వర్ధన్నపేట మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య, సర్పంచ్ కుల్లా పావని యాకాంతం, ఐనవోలు ఆలయ చైర్మన్ ప్రభాకర్ ప్రారంభించారు.

