వడగండ్ల వానలకు రైతులు ఆగం..700 కోట్ల దాకా నష్టం

వడగండ్ల వానలకు రైతులు ఆగం..700 కోట్ల దాకా నష్టం
  • మిర్చి పంటపైనే భారీ ఎఫెక్ట్
  • నీళ్లలో కొట్టుకుపోయిన మిరపకాయలు

హైదరాబాద్ / ఏటూరునాగారం / నెట్​వర్క్, వెలుగు: అకాల వర్షాలు రైతులను ఆగం చేశాయి. మూడు రోజులుగా కురుస్తున్న ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు పంటలు నాశనమయ్యాయి. వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వడగండ్ల వానలు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మొక్కజొన్న, మిర్చి, పెసర, బొబ్బర్లు, మినుములు.. మొత్తం 50 వేల ఎకరాల్లో రూ.700 కోట్ల మేర పంట నష్టం  జరిగినట్లు తెలుస్తోంది. ఒక్క వరంగల్ జిల్లాలోనే 20 వేల ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 5 వేల ఎకరాలు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో మరో 25 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.
వరంగల్ జిల్లాలోని నర్సంపేట, మహబూబాబాద్‌లోని కేసముద్రం, గూడురు, కొత్తగూడ, ములుగు జిల్లాలోని వెంకటాపూర్, ములుగు, ఏటూరు నాగారం, కన్నాయిగూడెం, వాజేడు, వెంకటాపురం, ఖమ్మం జిల్లాలోని కామేపల్లి, కూసుమంచి మండలాల్లో మిర్చి పంట దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. మొక్క జొన్నకూ భారీగా నష్టం వాటిల్లింది. ఇక మెదక్ జిల్లాలోని తూప్రాన్, వెల్దుర్తి, నిజాంపేట్, చిన్నశంకరంపేట మండలాల్లో గురువారం రాత్రి రెండు గంటల పాటు భారీ వర్షం కురిసింది. దీంతో 300 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. కూరగాయల పంటలకు ఎక్కువగా నష్టం జరిగిందని జిల్లా హార్టికల్చర్ ఆఫీసర్ నర్సయ్య చెప్పారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో మొక్కజొన్న, జొన్న, మిర్చి, టమాట పంటలు దెబ్బతిన్నాయి. మండలంలోని మైలారం, చల్లగర్గ, ధర్పల్లి, దమ్మన్నపేట్ ప్రాంతాల్లో ఎక్కువ నష్టం జరిగింది.
మిర్చి.. 30 వేల ఎకరాల్లో..
వరంగల్‌ జిల్లాలో 15 వేల ఎకరాలు, హనుమకొండ జిల్లాలో 5 వేల ఎకరాలు, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో 10 వేల ఎకరాలు కలిపి ఈ నాలుగు జిల్లాల్లోనే 30 వేల ఎకరాల్లో మిర్చి పంట దెబ్బతిన్నది. ఎకరానికి 2 లక్షల చొప్పున నష్టం జరిగింది. చాలా చోట్ల మిరప చేన్లపై వడగండ్లు పడి పంటంతా నేల రాలింది. ఎండబోసిన మిరపకాయలు కల్లాల మీదే తడిసిపోయాయి. కొన్ని చోట్ల వరదలో కొట్టుకుపోయాయి. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా మిర్చి పంటకు తామర వైరస్ సోకింది. దీంతో కొందరు తోటలను పూర్తిగా వదిలేశారు. ఇంకొందరు రైతులు మాత్రం లక్షల్లో అప్పులు చేసి మందులు కొట్టారు. ఎంతో కొంత దిగుబడి వస్తుందని ఆశించారు. అలాంటి రైతుల మీద ఇప్పుడు అకాల వర్షాలు మరో దెబ్బ కొట్టాయి.
ఫసల్ బీమా లేక రైతులకు నష్టం
వానలకు పంటలు దెబ్బతింటే రైతులకు పరిహారం అందాల్సి ఉంది. కానీ రాష్ట్ర సర్కారు ఫసల్ బీమా, వాతావరణ బీమాను రెండేళ్లుగా అమలు చేయడం లేదు. దీంతో రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి. పంట నష్ట పరిహారం ఇవ్వాలని ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో రైతులు ఇటీవల రాస్తారోకో చేశారు. ఎకరానికి రూ.50 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని  రైతు సంఘాలు కోరుతున్నాయి.
ఆరు జిల్లాల్లోనే ఎక్కువ
ప్రధానంగా వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అకాల వర్షాలకు పంటలపై ఎఫెక్ట్ పడింది. మూడు రోజుల్లో 20 మండలాల్లోని 300 గ్రామాల్లో పంటలకు నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. వరంగల్, హనుమకొండ జిల్లాల్లోనే ఎక్కువ డ్యామేజీ జరిగిందని పేర్కొంటున్నారు.
పంట పోయి అప్పులు మిగిలినై
నా భర్త చనిపోయినప్పటి నుంచి కూలి నాలి చేసుకుంట ఇద్దరు పిల్లల్ని సాదుకుంటున్న. నిరుడు అప్పు చేసి ఆడపిల్ల పెండ్లి చేసిన. ఆ అప్పు తీర్చడానికి ఎకరానికి రూ.20 వేల చొప్పున 2 ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి పంట వేసిన. పంటకు కొత్త రకం రోగమొచ్చి దిగుబడి చాన తక్కువ వచ్చింది. వచ్చిన కొద్దిపాటి పంటను వాగులో ఎండబెట్టిన. రాత్రి పడ్డ వానకు రెండెకరాల్లో ఏరిన కాయలు మొత్తం వరదలో కొట్టుకు పోయి గోదావరిలో కలిసినయ్. పంట పోయింది.. పెట్టుబడి కోసం తెచ్చిన రూ.4 లక్షల అప్పే మిగిలింది. సర్కారే ఆదుకోవాలి. - కాట ఆదిలక్ష్మి, పొద్మూరు, మంగపేట