మోడీతో మీటింగ్‌‌‌‌కు పోతం

మోడీతో మీటింగ్‌‌‌‌కు పోతం
  • గుప్కర్ అలయన్స్ చైర్ పర్సన్ ఫరూక్ అబ్దుల్లా
  • ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తామన్న ముఫ్తీ

శ్రీనగర్: ప్రధాని మోడీ ఈ నెల 24న నిర్వహిస్తున్న ఆల్ పార్టీ మీటింగ్​కు పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్(పీఏజీడీ) నేతలు హాజరు కానున్నట్టు ఆ కూటమి చైర్ పర్సన్, నేషనల్ కాన్ఫరెన్స్ ప్రెసిడెంట్ ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. మంగళవారం పీఏజీడీ నేతలు ఫరూక్ అబ్దుల్లాను కలిసి కేంద్రం పంపిన ఆహ్వానంపై చర్చించారు. ప్రధాని మోడీ నుంచి ఆహ్వానం అందిందని, తనతోపాటు పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ, సీపీఎం లీడర్​ తరిగమి ఇతర నేతలు హాజరవుతున్నట్టు ఫరూక్ అబ్దుల్లా చెప్పారు. మీటింగ్ ఎజెండా ఏమిటన్నది కేంద్రం స్పష్టం చేయలేదన్నారు. అయితే జమ్మూకాశ్మీర్​కు సంబంధించి తమ వైఖరిని ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు వివరిస్తామన్నారు. జమ్మూకాశ్మీర్​కు ప్రత్యేక హోదాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తామని పీడీపీ ప్రెసిడెంట్ మెహబూబా ముఫ్తీ తెలిపారు.' మా నుంచి లాక్కున్నదానిపై మాట్లాడుతాం. ప్రత్యేక హోదా రద్దు పెద్ద తప్పిదం. పునరుద్ధరిస్తేనే జమ్మూకాశ్మీర్​లో శాంతి సాధ్యం' అని ఆమె అన్నారు. మీటింగ్ ఎజెండాపై తమకు సమాచారంలేదని, అయితే పీఏజీడీ వైఖరిని స్పష్టంగా చెబుతామని ఆ కూటమి స్పోక్స్ పర్సన్, సీపీఎం లీడర్ ఎం.వై.తరిగమి అన్నారు.