
- వరి, పత్తి, మిరప.. ఏ పంటైనా వినియోగం ఎక్కువ
- తగ్గిపోయిన భూసారం, పంటల దిగుబడి
- రైతులకు పెరిగిన పెట్టుబడి ఖర్చులు
- మోతాదుకు మించి ఎరువులు వాడొద్దు
- రైతులను హెచ్చరిస్తున్న అగ్రికల్చర్ ఆఫీసర్లు, సైంటిస్ట్ లు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : కొన్నేండ్లుగా వ్యవసాయ పంటల్లో రసాయన ఎరువుల వాడకం చాలా పెరిగిపోయింది. ప్రస్తుతం ఒక రైతు తన పొలంలో బస్తా యూరియా వేస్తే.. పక్క పొలం రైతు ఒకటిన్నర బస్తా యూరియా చల్లే పరిస్థితి నెలకొంది. ఇలా మోతాదుకు మించి ఎరువుల వాడకం ద్వారా భూసారం తగ్గిపోవడమే కాకుండా పెట్టుబడి ఖర్చులు కూడా పెరిగిపోయాయి. ఎక్కువ మొత్తంలో ఎరువులు వాడితే పంటలకు కూడా అనర్థమే!. అంతేకాదు అధిక ఎరువుల వాడకం ద్వారా పర్యావరణంపైనా ప్రభావం చూపుతుంది. నీళ్లలో కరిగిపోకుండా ఉండిపోయి చెరువులు, నదుల్లో కలిసి నీటిని కలుషితం చేయడంతో పాటు గాలి కూడా విషతుల్యమవుతుంది. వానాకాలం సీజన్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు.
కాగా.. ఏ పంటకు ఎంత ఎరువు వేస్తే మంచిది? ఎరువులు అధికంగా వాడితే కలిగే నష్టాలేంటి? వంటి విషయాలపై అగ్రికల్చర్ ఆఫీసర్లు, రిటైర్డ్ సైంటిస్టులు జలపతిరావు, ఉమారెడ్డి పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో పంట్లలో ఎరువుల వాడకం ఎక్కువగా పెరిగిందని , తద్వారా భూసారం తగ్గిపోతూ భూమి గట్టిగా తయారవుతున్నట్లు వివరించారు. ఇందుకు ఉదాహరణగా..‘ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గతేడాది లక్ష 30 వేల టన్నులకుపైగా యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే.. రెండున్నరల లక్షల టన్నుల యూరియాను రైతులు వినియోగించారు. డీఏపీ, కాంప్లెక్స్, పొటాష్ మందుల వాడకంలోనూ రైతులు ఇలానే చేశారు. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో రైతులు ఎరువులను ఎంతగా వినియోగిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఎరువులు వాడే పద్ధతి ఇలా !
వరిలో ఎకరానికి120 కిలోల యూరియా, 60 కిలోల డీఏపీ లేదా కాంప్లెక్స్(భాస్వరం) ఎరువులు, 40 కిలోల పొటాష్(ఎంవోపీ) వాడాలి. పత్తిలో120 కిలోల యూరియా, 60 కిలోల భాస్వరం, 60 కిలోల పొటాష్, మిర్చి పంటలో 220 కిలోల యూరియా, 80 కిలోల భాస్వరం, 60‒80 కిలోల పొటాష్ వేయాలి. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వాడొద్దు. వీటిని దుక్కిలోనే వేయాలి. లేదా పంట నాటిన 15‒20 రోజుల్లో అందించాలి. వరిలో విష గుళికలతో కలిపి యూరియా చల్లకూడదు. పొలంలో యూరియా వేసేటప్పుడు నీరు ఉండొద్దు.
గుళికలు చల్లినప్పుడు నీరు ఉండాలి. రెండింటిని కలిపి ఒకేసారి వేస్తే, వీటిలో ఏదో ఒకటి మాత్రమే పనిచేసి రెండోది పనికిరాకుండా పోతుంది. వరిలో ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టాలి. పత్తిలో మొక్కకు 3 – 5 సెంటీమీ టర్ల దూరంలో 3 ‒5 సెం.మీ లోతులో ఎరువులు వేస్తే మొక్కలకు అందుతాయి. పైన మట్టి కప్పకపోతే గాలిలో ఆవిరైపోయి విషతుల్యమవుతాయి. మొక్కకు ఎరువులు అందవని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు ఇలా వివరించారు.
ఎక్కువగా వాడితే కలిగే నష్టాలు
పత్తి చేనులో యూరియా ఎక్కువగా వాడితే ఆకులు పెరిగి దిగుబడి పడిపోతుంది. వరిలోనూ అధికంగా యూరియా వేస్తే ఏపుగా పెరిగి కోత కంటే ముందే నేలపై వాలిపోతుంది. పంటలో రోగాలు వచ్చి చీడ పీడల సమస్య ఎక్కువవుతుంది. భూమిలో జింక్, మెగ్నీషియం లోపం తలెత్తుతుంది. పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు చనిపోతాయి. మరోవైపు పెట్టుబడి ఖర్చులు పెరిగి రైతులు అప్పుల పాలవుతారు.
ఎకరం పంటలో నత్రజని(యూరియా), భాస్వరం, పొటాష్‌లు 4:2:1 నిష్పత్తిలో వాడాల్సి ఉండగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో వీటిని 13:3:1 నిష్పత్తిలో వినియోగిస్తుండగా.. ఇది వంద శాతానికి మించి ఉన్నట్టు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.
సేంద్రియ ఎరువులను వేస్తున్నా..
గతంలో పంట దిగుబడి ఎక్కువగా రావాలని అధికంగా రసాయనిక ఎరువులను వాడాను. దిగుబడి పెరిగినప్పటికీ పెట్టుబడి ఖర్చులు అంతకంటే ఎక్కువ అయ్యాయి. పంట కాలం పూర్తయ్యాక లెక్క చూసుకుంటే లాభం పోను అప్పులే మిగిలాయి. రసాయనిక ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులను వేయడం ప్రారంభించాను.
- దుబాసి నర్సయ్య, చల్లగరిగె, చిట్యాల మండలం, భూపాలపల్లి జిల్లా
ఆఫీసర్లు, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తున్నా..
ఎరువుల వాడకంపై అగ్రికల్చర్ ఆఫీసర్ల, శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తున్నా. భూసారం తగ్గకుండా, పెట్టుబడి ఖర్చులు పెరగకుండా పంటలు ఎలా పండించాలో వారు చెబుతున్నట్లుగానే ఎరువులు వేస్తున్నా. దీంతో పంట పెట్టుబడి ఖర్చులు తగ్గి, దిగుబడి పెరిగింది. సాదు కుమారస్వామి, శాయంపేట, హనుమకొండ జిల్లా