దోహా చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్

దోహా చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్

దోహా : భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్​ ఖతర్ దేశానికి చేరుకున్నారు. దోహాలో జరిగే ఫిఫా ప్రపంచకప్ ఫుట్ బాల్  ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన దోహా నగరానికి వచ్చారు. ప్రపంచకప్ ఫుట్ బాల్ టోర్నీని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఆహ్వానం మేరకు భారత ఉప రాష్ట్రపతి దోహాను సందర్శిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా దోహా చేరుకున్న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ కర్‌కు ఘన స్వాగతం లభించిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్వీట్ చేశారు.

అల్ బైత్ స్టేడియంలో జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఫుట్ బాల్ ప్రారంభ వేడుకలకు భారత్ తరపున  ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్ కర్​ హాజరయ్యారు.  రెండు రోజుల ఖతార్ పర్యటనలో భాగంగా అక్కడి భారతీయులతో.. ఇతర ముఖ్యులతోనూ ఉపరాష్ట్రపతి సమావేశం కానున్నారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న సన్నిహిత, స్నేహ పూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశలో ఉప రాష్ట్రపతి పర్యటిస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ -ఖతార్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 15 బిలియన్లు (ఒక బిలియన్=100 కోట్లు) దాటింది.