ఏపీలో మాస్కులేదని ఫోటో పంపినా ఫైన్

ఏపీలో మాస్కులేదని ఫోటో పంపినా ఫైన్
  • నిబంధనలు పాటించకపోతే దుకాణాలకు జరిమానాతోపాటు 2 లేదా 3 రోజులపాటు మూసివేత
  • కరోనా  థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం 
  • ఇకపై అన్ని జిల్లాల్లో ఒకేలా  కర్ఫ్యూ ఆంక్షలు
  • రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు

అమరావతి: కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వైద్య నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా ఆంక్షలు కట్టుదిట్టంగా అమలు చేయాలని నిర్ణయించింది. ఉదాసీనతకు.. నిర్లక్ష్యానికి తావులేకుండా కఠినంగా నిబంధనలు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ముఖ్యంగా మాస్కులు ధరించడంలో.. సోషల్ డిస్టెన్స్ పాటించడంలో అన్ని చోట్లా నిర్లక్ష్యం కనిపిస్తుండడంపై వైద్య నిపుణుల హెచ్చరికలను పరిగణలోకి తీసుకుంటూ.. మాస్కు ధరించలేదని ఫోటో తీసి పంపినా ఫైన్ వేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనికోసం అవసరమైతే ప్రత్యేక వాట్సప్ నెంబర్ ఇవ్వాలని సూచించారు. 
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సోమవారం సీఎం జగన్ తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఆళ్ల నాని, సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణతోపాటు ఉన్నతాధికారులతో సమీక్ష సందర్భంగా కరోనా పరిస్థితులపై చర్చించారు. కేసుల పరిస్థితిని విశ్లేషిస్తూ  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కర్ఫ్యూ ఆంక్షలు అన్ని జిల్లాల్లో ఒకే నిబంధనలు అమలు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్న ఉభయ గోదావరి జిల్లాల్లో కర్ఫ్యూ ఆంక్షల సడలింపు మధ్యాహ్నం వరకు మాత్రమే అనుమతి ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇకపై ఈ జిల్లాల్లో కూడా మిగిలిన అన్ని జిల్లాలతోపాటే ఉదయం 6 నుంచి రాత్రి 9వ వరకు ఆంక్షల సడలింపు అమలు చేస్తారు. అలాగే దుకాణాలు రాత్రి 9 గంటలకు మూసివేసి రాత్రి 10లోగా అందరూ తమ తమ ఇళ్లకు చేరుకోవాలి. 
నిబంధనలు పాటించని దుకాణాలకు జరిమానాతోపాటు 3 రోజులపాటు దుకాణాలు బంద్
కరోనా నిబంధనలు పాటించే విషయంలో దుకాణా దారుల్లో జవాబుదారీతన పెంచేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేయాలని నిర్ణయించారు. అంటే ఎక్కడైనా దుకాణాల వద్ద జనం ఎక్కువ గుమిగూడినా.. సామాజిక దూరం పాటించకపోయినా.. మాస్కులు ధరించకుండా కనిపించినా దుకాణా దారులకు జరిమానా విధించడంతోపాటు 2 లేదా 3 రోజులపాటు దుకాణాలు మూసివేయించాలని నిర్ణయించారు. నిబంధనలు పాటించని దుకాణాల ఫోటోలు తీసి వారికి పంపే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలాగే మార్కెట్లు, బహిరంగ ప్రదేశాల్లో అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ప్రభుత్వం ఆదేశించింది. మాస్కులు ధరించకపోతే రూ.100 జరిమానా విధించనున్నారు. బహిరంగ ప్రదేశాల్లో జనం గుమిగూడకుండా 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.