కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

కోవిడ్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 13 మంది మృతి

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఘోరం జరిగింది. విరార్‌లోని విజయ్ వల్లభ్ హాస్పిటల్‌లో మంటలు చెలరేగి 13మంది పేషెంట్లు స్పాట్‌లోనే చనిపోయారు. రాష్ట్రంలో కేసులు పెరగడంతో ఈ హాస్పిటల్‌ను కరోనా హాస్పిటల్‌గా మార్చారు. శుక్రవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో ఈ ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో షార్ట్ సర్క్యూట్ కావటంతో మంటలు చెలరేగాయి. దాంతో ఐసీయూలో చికిత్స పొందుతున్న వారిలో 13 మంది చనిపోగా.. 21 మంది గాయపడ్డారు. గాయపడ్డవారిని దగ్గర్లోని ఇతర హాస్పిటల్స్‌కు షిఫ్ట్ చేశారు. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తమవాళ్లు చనిపోయారని మృతుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగినపుడు ఒక్క డాక్టర్ కూడా వార్డులో లేరని తెలుస్తోంది. 

‘ప్రమాదం జరిగిన సమయంలో హాస్పిటల్‌లో 90 మంది పేషంట్లు ఉన్నారు. సెకండ్ ఫ్లోర్‌లోని ఐసీయూలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలంటుకున్నాయి. దాంతో ఐసీయూలోని 13 మంది చనిపోయారు’ అని విజయ్ వల్లభ్ ఆస్పత్రి సీఈఓ దిలీప్ షా తెలిపారు.

ఈ ఘటన గురించి తెలిసిన ప్రధాని మోడీ దిగ్ర్బాంతి వ్యక్తం చేశారు. ‘పాల్ఘర్ ఘటన నన్ను కలిచివేసింది. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని మోడీ ట్వీట్ చేశారు. అంతేకాకుండా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు పీఎం రిలీఫ్ పండ్స్ నుంచి రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు కూడా ప్రకటించారు. 

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే ఆస్పత్రిలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణం రూ. 50 వేల సాయం చేయనున్నట్లు సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించారు.