సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం.... 8మంది మృతి

సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం.... 8మంది మృతి

సికింద్రాబాద్ ఎలక్ట్రిక్  స్కూటర్ల షోరూంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ-స్కూటర్లు ఒక్కొక్కటిగా వరుసపెట్టి పేలడంతో....భారీగా మంటలు ఎగసిపడ్డాయి. దట్టమైన పొగ, మంటలు షోరూం పైన ఉన్న రూబీ హోటల్ కు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలిసేలోపే కొందరు స్పాట్ లోనే చనిపోయారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకొందరు ప్రాణభయంతో పైనుంచి కిందకు దూకారు. తీవ్రగాయాలపాలై.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రమాదంలో 8 మంది చనిపోయారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. వీరిని యశోద, గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో వైజాగ్ కు చెందిన సంతోష్, యోగిత.. బెంగళూరుకు చెందిన జయంత్, కోల్ కతాకు చెందిన దేభాశీష్ గుప్తా, చెన్నైకి చెందిన కేశవన్, హర్యానాకు చెందిన దీపక్ యాదవ్, ఒడిశాకు చెందిన ఉమేష్ కుమార్ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. ఇందులో బెంగళూరుకు చెందిన జయంత్ ఐసీయూలో ఉన్నాడు.

ఐదుగురు స్పాట్ లోనే చనిపోగా.. మరో ముగ్గురు ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందారు. మృతుల్లో ఆరుగురు పురుషులు కాగా... ఇద్దరు మహిళ. చనిపోయిన వారిలో విజయవాడకు చెందిన ఎ. హరీష్, చెన్నై వాసి సీతారామన్, ఢిల్లీకి చెందిన వీతేంద్ర ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉంది. మంటలుపై అంతస్తులోకి వ్యాప్తంచడంతో రెండు, నాలుగో అంతస్తు నుంచి కొందరు కిందకి దూకారు. వీరిలో నలుగురి తీవ్ర గాయాలు కాగా.. వారి పరిస్థితి విషమంగా ఉంది.

సికింద్రాబాద్ ఘటనపై విచారణకు ఆదేశిస్తామన్నారు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ. మరోవైపు ఘటన స్థలాన్ని హోంమంత్రి మహమూద్ అలీతో పాటు... మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సీపీ CV ఆనంద్ పరిశీలించారు. గాయపడిన వారికి హాస్పిటల్స్ లో చికిత్స జరుగుతోందని తెలిపారు. మరోవైపు ఘటనపై విచారన ప్రారంభించినట్లు సీపీ సీవీ ఆనంద్ తెలిపారు . 

ఎలక్ట్రిక్  స్కూటర్ వ్యాపారి రంజిత్ సింగ్ బగ్గపై కేసు నమోదు చేసి...గోపాలపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు . రంజిత్ సింగ్ బగ్గాను అదుపులోకి తీసుకున్నారు. అటు రూబీ లగ్జరీ హోటల్ భవనాన్ని సీజ్ చేశారు. అగ్ని ప్రమాదానికి కారణాలపై ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. 

రూబీ ఎలక్ట్రిక్  షోరూం, హోటల్  మొత్తం ఐదంతస్తుల్లో ఉంది. అయితే ఆ హోటల్  భవనం నుంచి లోనికి వెళ్లడానికి, బయటకు రావడానికి ఒకే దారి ఉంది. భవనానికి సెట్  బ్యాక్స్ లేవు. దీంతో.. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సరిపడా అగ్నిమాపక వాహనాలు వచ్చినా.. ఒకవైపు నుంచే మంటలను ఆర్పాల్సి వచ్చింది. హోటల్  గదుల్లో ఏసీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని ఫైర్  సిబ్బంది చెబుతున్నారు.మృతుల కుటుంబాలకు రాష్ట్రం ప్రభుత్వం 3 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించగా..కేంద్రం 2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

ప్రధాని మోడీ సంతాపం...

సికింద్రాబాద్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్న మోడీ... మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. PMNRF నుండి మృతుల ఒక్కో కుటుంబానికి రూ.2 లక్షలు చెల్లిస్తామని, వారికి రూ.50,000  ఆర్థిక సహాయం అందజేస్తామని వెల్లడించారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి...

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సికింద్రాబాద్ అగ్ని ప్రమాద బాధితులకు సంతాపం తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏడుగురు దుర్మరణం పాలయ్యారన్న రేవంత్ రెడ్డి... గతంలో హైదరాబాద్ లో అనేక అగ్ని ప్రమాదాలు జరిగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్షమే ఇంతటి విపత్తులకు కారణమన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లాంటి మహా నగరంలో ప్రభుత్వం నియమ నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడం వల్లనే ఇలాంటి ప్రమాదాలకు జరుగుతున్నాయన్న ఆయన... గతంలో ఇదే సికింద్రాబాద్ లోని ఇనుము తుక్కు గోడౌన్లో ఇలాంటి ప్రమాదం జరిగి పలువురు ప్రాణాలు పోయారని చెప్పారు. ప్రభుత్వం వెంటనే ఒక ఉన్నత స్థాయి కమిటీ వేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయాలని కోరారు. ఈ ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.