
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొదటి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం
- లబ్ధిదారులకు బట్టలు పెట్టిన విప్ ఆది శ్రీనివాస్
కోనరావుపేట/వేములవాడ/కోరుట్ల, వెలుగు : ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతీక అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మొదటగా కోనరావుపేట మండలం కొలనూరుగొల్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి కాగా... బుధవారం గృహప్రవేశం చేశారు. ఈ కార్యక్రమానికి విప్ ఆది శ్రీనివాస్ హాజరై లబ్ధిదారులైన కలకుంట్ల లక్ష్మణ్‌రావు, రమణ దంపతులకు బట్టలు పెట్టారు. అలాగే వేములవాడ పట్టణంలోని సుభాశ్‌నగర్‌లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల గడప పూజ కార్యక్రమానికి ఆయన హాజరై బట్టలు అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో చాలా ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలు, గూడు లేనివారు ఆత్మగౌరవంతో బతకాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తోందన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ రాకేశ్, రమేశ్, రాజు, రాంబాబు, పాష, అజయ్ పాల్గొన్నారు. అనంతరం కథలాపూర్ మండలం దుంపేట గ్రామంలోని వరదకాల్వను పరిశీలించారు.