
- ఆపరేషన్ సిందూర్‌తో మురిద్కే క్యాంపును ఇండియా పేల్చేసింది
- మరింత పెద్ద క్యాంపును నిర్మిస్తున్నట్లు వెల్లడి
ఇస్లామాబాద్: ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా తమ క్యాంప్ పూర్తిగా ధ్వంసమైందని లష్కరే తొయిబా కమాండర్ ఖాసిం ప్రకటించాడు. మే 7వ తేదీన అర్ధరాత్రి దాటాక ఇండియా వైమానిక దాడులు చేసిందని, ఇందులో మురిద్కేలోని మర్కజ్ తాయిబా క్యాంపు నేలమట్టమైందని తెలిపాడు. అయితే, ఈ క్యాంపు ఇప్పుడు ఎలా ఉందనేదానికి సంబంధించిన ఖాసిం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. అయితే.. ఇప్పుడు ధ్వంసమైన క్యాంపు కంటే మరింత పెద్ద స్థావరం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నాడు. ఇన్నాళ్లూ ఆపరేషన్ సిందూర్‌లో తమ పౌరులపై ఇండియా దాడి చేసిందని పాక్ చెప్తున్నవన్నీ కట్టుకథలే అని ఖాసిం ప్రకటనతో తేలిపోయింది. ధ్వంసమైన క్యాంపు ముందు ఖాసిం నిలబడిన వీడియో వైరల్ అవుతున్నది. ‘‘నేను మురిద్కేలోని మర్కజ్ తొయిబా క్యాంపు ముందు నిలబడి ఉన్నాను. ఈ క్యాంపు ఆపరేషన్ సిందూర్ దాడిలో ధ్వంసమైంది. దేవుడి దయ వల్ల గతంలో కంటే పెద్ద క్యాంపును మళ్లీ నిర్మిస్తాం. మరింత ఎక్కువ మందికి ముజాహిదీన్ ట్రైనింగ్ ఇచ్చేలా అన్ని సౌలత్‌లతో ఏర్పాటు చేస్తాం. ఈ క్యాంపులోనే వందల మంది ముజాహిదీన్లు ట్రైనింగ్ తీసుకున్నారు. అందరూ విజయం సాధించారు’’ అని ఖాసిం ప్రకటించాడు. కాగా, పునర్నిర్మాణ పనులు.. ముంబై 26/11 దాడులకు మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ నేతృత్వంలో కొనసాగుతున్నాయి. 2026 ఫిబ్రవరి నాటికి పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
మురిద్కే క్యాంప్‌కు పాక్ సర్కార్ ఫండింగ్
మురిద్కేలోని ఈ బిల్డింగ్ ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగించడంలేదని పాకిస్తాన్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. లష్కరే తొయిబా డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరీ మరో వీడియోలో ‘ఈ కేంద్రాన్ని పునర్నిర్మించేందుకు పాక్ ప్రభుత్వం, ఆర్మీ నిధులు అందించాయి’ అని చెప్పడం కొసమెరుపు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ధ్వంసం చేసిన 9 టెర్రర్ క్యాంపుల్లో మురిద్కేలోని మర్కజ్ తొయిబా ఒకటి.
బీఎల్‌ఏపై ఆంక్షల యత్నాన్ని అడ్డుకున్న అమెరికా
వాషింగ్టన్: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్‌ఏ), దాని అనుబంధ సంస్థ మజీద్ బ్రిగేడ్‌పై ఆంక్షలు విధించాలన్న పాక్, చైనా ప్రయత్నాలకు అమెరికా బ్రేక్ వేసింది. వాటిని ఉగ్ర సంస్థలని ప్రకటించేందుకు సరైన ఆధారాలులేవని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్(యూఎన్‌వో) భద్రతా మండలిలో యూఎస్‌తో పాటు యూకే, ఫ్రాన్స్ ప్రతిపాదించాయి. ఈ రెండు గ్రూపులను నెల కింద విదేశీ ఉగ్రవాద సంస్థలు (ఎఫ్‌టీవో)గా ప్రకటించిన అమెరికా.. ఇప్పుడు దానికి విరుద్ధంగా యూఎన్‌వోలో పాక్–చైనా ప్రతిపాదనను అడ్డుకోవడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు బీఎల్‌ఏతోపాటు మజీద్ బ్రిగేడ్‌ను ఉగ్ర సంస్థలుగా ప్రకటించాలని భద్రతా మండలిలో చైనా, పాక్ ఉమ్మడి బిడ్ సమర్పించాయి. యూఎన్‌వోలో పాక్ శాశ్వత ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ.. బీఎల్‌ఏ, మజీద్ బ్రిగేడ్‌తో పాటు ఐఐఎస్ఐఎల్‌కే, అల్‌ఖైదా, తెహ్రిక్ ఇ తాలిబాన్ పాకిస్తాన్‌లాంటి ఉగ్రవాద సంస్థలు అఫ్గాన్ కేంద్రంగా సీమాంతర దాడులకు పాల్పడుతున్నా యని అన్నారు. వాటి కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ జాబితాపై తగిన నిర్ణయం తీసుకోవాలని భద్రతా మండలిని కోరారు. కాగా, యూఎన్ 1267 రెజైమ్ ప్రకారం.. బీఎల్‌ఏ, మజీద్ బ్రిగేడ్‌కు అల్‌ఖైదా, ఐఎస్ఐఎల్‌తో లింక్ ఉన్నట్టు సరైన ఆధారాల్లేవని యూఎస్, యూకే, ఫ్రాన్స్ పేర్కొన్నాయి. దీంతో పాక్–చైనా ప్రతిపాదనకు ఆరు నెలలు బ్రేక్ పడనున్నది.