- మత్స్య దినోత్సవం సందర్భంగా పోటీలు.. గంగపుత్ర మహాసభ ఆధ్వర్యంలో నిర్వహణ
ముషీరాబాద్, వెలుగు: మత్స్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గంగపుత్ర మహాసభ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ముషీరాబాద్ మున్సిపల్ గ్రౌండ్లో వల విసిరే పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకారులు చేపల కోసం చెరువుల్లో వలలు ఎలా వేస్తారో గ్రీన్ మ్యాట్‌పై వేసి చూపించి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, గంగపుత్ర మహాసభ జాతీయ అధ్యక్షుడు ఆర్కే ప్రసాద్ హాజరై శుక్రవారం ఈ పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్కే ప్రసాద్ మాట్లాడారు.
సర్కిల్ నుంచి ఎంత దూరంలో వల విసురుతారు? విసిరిన వల ఎంత గుండ్రంగా పడింది? అనే రెండు అంశాలను ప్రధానంగా తీసుకున్నం. వాటి చుట్టు కొలతలను పరిగణనలోకి తీసుకున్నం. ఈ పోటీలు గంగపుత్రులకు చాలా ముఖ్యం. వృత్తి నైపుణ్యతను పెంచడానికి ఫస్ట్ టైమ్ ఈ పోటీలు నిర్వహించినం’’అని ప్రసాద్ తెలిపారు. ఈ పోటీల్లో 167 మంది గంగ పుత్రులు పాల్గొన్నారు. హైదరాబాద్ రామంతపూర్ కు చెందిన గూడబోయిన సాయిలుకు మొదటి ప్రైజ్ కింద రూ.1,000 నగదు బహుమతి, సెకండ్ ప్రైజ్ కింద వరంగల్ కు చెందిన వెంకటేశ్‌కు రూ.500 క్యాష్, మూడో ప్రైజ్ వరంగల్ కే చెందిన సంతోష్ కు రాగా అతనికీ రూ.500 ప్రైజ్ మనీ ఇచ్చారు. మిగిలిన గంగపుత్రులను సన్మానించారు.
