- ఆర్థిక ఇబ్బందులే కారణం
- నాగోల్ తట్టిఅన్నారంలో ఘటన
ఎల్బీనగర్, వెలుగు: ఆర్థిక ఇబ్బందులతో ఓ దంపతులు పాయిజన్ తీసుకొని ఆత్మహత్యాయత్నం చేయగా, వీరిలో భార్య మృతి చెందింది. భర్త ప్రాణాపాయ స్థితిలో ఉస్మానియా దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. పోలీసుల వివరాల ప్రకారం.. నాగోల్పరిధిలోని చైతన్యపురి మార్గదర్శి కాలనీకి చెందిన గడ్డమీది మల్లేశ్ (45), సంతోషి (37) దంపతులు కూరగాయల వ్యాపారం చేస్తున్నారు.
వీరికి ఒక కొడుకు శివ, ఇద్దరు కుమార్తెలు మేఘన, మౌనిక ఉన్నారు. శుక్రవారం ఉదయం దంపతులిద్దరూ వాకింగ్కు వెళ్లి ఇంటికి తిరిగి రాలేదు. దీంతోఆందోళన చెందిన కొడుకు శివ తండ్రికి ఫోన్‌చేయగా స్పందించలేదు. కాసేపటికి శివ వాట్సాప్ కు తండ్రి నుంచి ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది. ఎస్బీఐ బ్యాంక్ నుంచి తమ ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ, 40 లక్షలు వస్తాయని అందులో పేర్కొన్నారు.
ఆ తర్వాత ఫోన్ స్విచాఫ్ రావడంతో బాధితుడు చైతన్యపురి, నాగోల్ పోలీస్ స్టేషన్లలో తన పేరెంట్స్ మిస్సింగ్ పై ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా నాగోల్ బండ్లగూడ పరిధి తట్టి అన్నారంలోని నిర్మానుష్య ప్రదేశంలో దంపతులిద్దరిని అపస్మారక స్థితిలో గుర్తించారు. అప్పటికే సంతోషి మృతి చెందగా, మల్లేశ్ పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కు తరలించారు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యాయత్నం చేశామని ఈ సందర్భంగా మల్లేశ్ పోలీసులకు తెలిపాడు. ఈ మేరకు చైతన్యపురి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
