- ఇది మన జాతీయ సంపద: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- వర్సిటీ విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తుంది
- గోల్డెన్ జూబ్లీ, అలూమ్నిమీట్ వేడుకలు ప్రారంభం
కూకట్పల్లి, వెలుగు: ఆరు దశాబ్దాలుగా సాంకేతిక విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న జేఎన్టీయూ దేశానికే గర్వకారణమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జాతీయ సంపద అయిన జేఎన్టీయూ విస్తరణ, అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. శుక్రవారం జేఎన్టీయూలో నిర్వహించిన గోల్డెన్ జూబ్లీ, అలూమ్నిమీట్ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో భట్టి మాట్లాడుతూ ప్రభుత్వ నూతన విద్యా విధానానికి అనుగుణంగా యూనివర్సిటీ మారుతుండటం అభినందనీయమన్నారు. తమ ప్రభుత్వం సాంకేతిక విద్యను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావటానికి కృషి చేస్తుందని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నలాజికల్ సెంటర్స్‌గా మార్చామని గుర్తు చేశారు.
సాంకేతిక రంగంలో విద్య, ఉపాధి అవకాశాలను పెంపొందించేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నామని ఆయన వివరించారు. ‘తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో రాష్ట్రాన్ని గ్లోబల్ గ్రోత్ ఇంజిన్‌గా మార్చటానికి ప్రభుత్వం చేస్తున్న కృషిలో జేఎన్టీయూ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. అంతకు ముందు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు గోల్డెన్ జూబ్లీ వేడుకల పైలాన్‌ను ఆవిష్కరించారు.
జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్ కిషన్ కుమార్‌రెడ్డి మాట్లాడుతూ వర్సిటీ అభివృద్ధి కోసం పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయాలని కోరారు. 80 ఎకరాల్లో విస్తరించి ఉన్న వర్సిటీకి ప్రాపర్టీ ట్యాక్స్ నుంచి, స్థలం లీజు బకాయిల నుంచి మినహాయింపు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వి.బాలకృష్టారెడ్డి, జి.సతీశ్‌రెడ్డి, కె.విజయకుమార్, కె.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
