ఎస్బీఐ పేరుతో పోర్టల్.. అందులో సినిమాలు.. ఐబొమ్మ కోసం సెర్చ్ చేసే వారిని అక్కడికి డైవర్షన్

ఎస్బీఐ పేరుతో పోర్టల్.. అందులో సినిమాలు.. ఐబొమ్మ కోసం సెర్చ్ చేసే వారిని అక్కడికి డైవర్షన్
  • అందులో సినిమాలు ఎలా చూడాల్నో రీల్స్ ద్వారా సూచనలు 
  • ఆ వెబ్ సైట్​నూ తొలగించిన పోలీసులు 

హైదరాబాద్​ సిటీ, వెలుగు: పైరసీ సినిమా సైట్లు రోజుకో రూపంలో కనిపిస్తున్నాయి. గత వారం ఐబొమ్మ వెబ్‌‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ సంచనలం సృష్టించడంతో ఇప్పుడు చర్చ అంతా పైరసీ వెబ్​సైట్ల చుట్టూనే తిరుగుతోంది. ఐబొమ్మ, బప్పం సైట్లు బ్లాక్ అయినా.. ఆ పేర్లతో వివిధ రకాల వెబ్​సైట్లు కనిపిస్తూనే ఉన్నాయి. 

తాజాగా మరో షాకింగ్​విషయం బయటకొచ్చింది. సినిమాలను డైరెక్ట్ పైరసీ సైట్లలో ప్లే చేయకుండా.. ఇతర కంపెనీల పేర్లతో వెబ్​పేజీలు సృష్టించి అందులో ప్లే చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెండ్రోజులుగా పైరసీ సినిమాలు ఎస్బీఐ ఇన్సూరెన్స్ పోర్టల్​లో ప్లే కావడం కలకలం రేపుతోంది. 

ఐబొమ్మ ఇప్పుడు హాట్​టాపిక్​ కావడంతో తెలియని వారు కూడా ఐబొమ్మ కోసం సెర్చ్ చేస్తున్నారు. అలాంటి వాళ్లందరికీ బప్పం సైట్​పేరుతో మరో వెబ్​సైట్​ కనిపిస్తోంది. అందులోకి వెళ్తే దాంట్లో మూవీ థంబ్​ నెయిల్ ​కింద మూవీ ఐడీ ఉంటుంది. దాన్ని కాపీ చేసి ఎస్​బీఐ లైఫ్​ ఇన్సూరెన్స్​ పేరుతో ఉన్న డమ్మీ వెబ్​సైట్​లోకి వెళ్లి అందులో పేస్ట్​ చేస్తే అక్కడ మూవీ ప్లే అయ్యేలా సెట్ చేశారు.  

ఇన్ స్టా, ఫేస్ బుక్ రీల్స్​లోనూ.. 

ఎస్​బీఐ టర్మ్​ ల్యాప్స్ లో సినిమాలు వస్తుండడం గురించి ఇన్​స్టాతో పాటు ఫేస్​బుక్​లో రీల్స్​ ప్లే అయ్యాయి. దీంతో అందులో వారు చెప్పినట్టు ఫాలో అవుతూ జనం సినిమాలు చూడడం మొదలుపెట్టారు. 

ఒక రీల్​లో ‘ఐబొమ్మ రవి అరెస్టుతో ఐబొమ్మ, బప్పం మొత్తం క్లోజ్​అయ్యిందనుకుంటున్నరు.. కానీ.. క్లోజ్ కాలే.. మూవీ లింక్​లు ఏడ పెట్టిందో తెల్సా.. ఎస్​బీఐ ఇన్సూరెన్స్ ​అని ఒక పోర్టల్​ క్రియేట్​చేసి అందులో పెట్టిండు.. ఏదైనా ఒక బ్రౌజర్ ​ఓపెన్​చేసి అందులో బప్పం సైట్​అని సెర్చ్ చేయండి. 

సైట్​ఓపెన్​అయిన తర్వాత అందులో మీకు ఇష్టమైన సినిమాను క్లిక్​చేసి కింద కాపీ మూవీ ఐడీ అని ఉంటది.. దాన్ని కాపీ చేసి తర్వాత ఇంకో కొత్త ట్యాబ్ ​ఓపెన్ ​చేసి అక్కడ ఎస్​బీఐ టర్మ్​ ల్యాప్స్​అని సెర్చ్ ​చేయండి. 

ఫస్ట్ వచ్చిన లింక్​ను ఓపెన్​చేసి కిందకు స్క్రోల్​ చేయండి.. లాస్ట్​కు వచ్చిన తర్వాత పేస్ట్ హియర్ అని ఉన్న చోట కాపీ చేసిన లింక్​ను ఎంటర్ చేసి వాచ్ అని క్లిక్ చేస్తే సినిమా అక్కడ ప్లే అవుతుంది’  అంటూ సీక్రెట్స్ రివీ ల్​చేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆ వెబ్ సైట్​ను డౌన్​ చేయించారు. దీంతో సినిమాలు ఆగిపోయాయి.