ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన EPFO.. రూ.25 వేల జీతం ఉన్న వాళ్లకు కూడా పెన్షన్ ప్రయోజనాలు

ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన EPFO.. రూ.25  వేల జీతం ఉన్న వాళ్లకు కూడా పెన్షన్ ప్రయోజనాలు

న్యూఢిల్లీ:  ఇక నుంచి నెలకు రూ.25 వేల వరకు జీతం పొందే ఉద్యోగులు కూడా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్‌‌ (ఈపీఎస్‌‌) లో చేరవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌‌ఓ) ప్రస్తుతం ఉన్న శాలరీ లిమిట్​ను పెంచాలని ఆలోచిస్తోంది. దీంతో లక్షలాది మంది ఉద్యోగులకు పెన్షన్ ప్రయోజనం అందుతుందని అంచనా.  

ప్రస్తుతం రూ.15 వేల వరకు శాలరీ పొందుతున్న ఉద్యోగి తప్పనిసరిగా ఈపీఎస్‌‌లో చేరాలి. ఈ జీతంలో 12 శాతం అమౌంట్‌‌ను యజమాని పీఎఫ్‌‌కు కంట్రిబ్యూట్ చేయాలి. పీఎఫ్‌‌ అమౌంట్‌‌లో కొంత భాగం ఈపీఎస్‌‌కి పోగా, మిగిలినది పీఎఫ్‌‌కి వెళుతుంది. ఉద్యోగి మాత్రం పీఎఫ్‌‌కి మాత్రమే కంట్రిబ్యూట్ చేస్తాడు.   

శాలరీ పరిమితి 2014లో రూ.6,500 నుంచి రూ.15వేలకి పెరిగినప్పటి నుంచి మారలేదు.  ఫైనాన్షియల్ సర్వీసెస్ శాఖ కార్యదర్శి ఎం నాగరాజు మాట్లాడుతూ,  ‘‘ఈ పరిమితిని మించి సంపాదిస్తున్నా చాలా మంది ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనాలను అందుకోలేకపోతున్నారు. రిటైర్మెంట్ తర్వాత వారికి ఆర్థిక భద్రత లేకపోవడంతో సంతానంపై ఆధారపడాల్సి వస్తోంది”అని అన్నారు. 

ఇప్పుడు ఈపీఎఫ్‌‌ఓ  ఈ సమస్యను పరిష్కరించేందుకు పరిమితిని రూ.25వేలకి పెంచే ప్రతిపాదనను సిద్ధం చేసిందని తెలిపారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చే ఏడాది దీనిని పరిశీలించనుంది. ఆమోదం లభిస్తే, ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్ వ్యవస్థలో చేరతారు. ‘‘పీఎఫ్‌‌ సేవలు ప్రతి కార్మికుడికి వేగంగా, గౌరవంతో చేరేలా చర్యలు తీసుకుంటున్నాం. కొత్త నియమం అమలైతే, ఉద్యోగుల రిటైర్మెంట్ జీవితం మరింత భద్రతతో ఉంటుంది”అని  కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా అన్నారు.