భద్రాచలం, వెలుగు: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా ఎన్కౌంటర్కు నిరసనగా ఈ నెల 23న దేశవ్యాప్త బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఆ పార్టీ ప్రతినిధి అభయ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నిరాయుధులైన మడవి హిడ్మా, ఆయన భార్య రాజేలతో పాటు ఆరుగురు మావోయిస్టులను ఏపీ పోలీసులు విజయవాడలో పట్టుకుని మారేడుమిల్లి అడవుల్లో కాల్చి చంపి ఎన్కౌంటర్ కథ అల్లారని మండిపడ్డారు. అనార్యోగంతో ఉన్న హిడ్మా ట్రీట్మెంట్కోసం విజయవాడకు వచ్చారని, విప్లవ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఎస్ఐబీ పోలీసులు ఆయన్ను పట్టుకున్నారని పేర్కొన్నారు.
ఈ నెల 15న పట్టుకుని 18న కాల్చి చంపారన్నారు. చత్తీస్గఢ్ కు చెందిన ఆదివాసీ సంఘం సీనియర్ నాయకుడు మనీష్ కుంజా కూడా ఎన్కౌంటర్పై మాట్లాడుతూ.. తాడిమెట్ల, జీరంఘాట్ఘటనల్లో హిడ్మా ప్రమేయం లేదని, ఆంధ్రాకు చెందిన కొంత మంది పార్టీ నేతలు హిడ్మా కదలికలపై పోలీసులకు సమాచారం ఇచ్చారని మండిపడ్డారు. ఈ ఎన్కౌంటర్లో దేవ్జీ పాత్ర ఉందని ఆరోపించారు.
