- కేంద్రం తక్షణమే బూటకపు ఎన్ కౌంటర్లు ఆపాలి
- ట్యాంక్ బండ్ వద్ద వామపక్ష
- పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల నేతల నిరసన
- మనుషుల ఊచకోతపై సుప్రీంకోర్టు మౌనం బాధాకరం: కూనంనేని
- మావోయిస్టులను చంపేస్తామనడం చట్ట వ్యతిరేకం: జాన్ వెస్లీ
- ఎన్ కౌంటర్ల తీరుపై అనేక అనుమానాలున్నయ్: జస్టిస్ చంద్రకుమార్
ట్యాంక్ బండ్, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు తక్షణమే బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని వామపక్ష పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, పౌర హక్కుల ప్రతినిధులు డిమాండ్చేశారు. ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లుగా ముద్రవేసి చంపేస్తున్నారని మండిపడ్డారు. శుక్రవారం హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఫేక్ ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, ప్రొఫెసర్ హరగోపాల్, సాదినేని వెంకటేశ్వర్ రావు, పోటు రంగారావు, హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ చంద్రకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. కేంద్ర సర్కారు మనుషుల ఊచకోతకు పాల్పడుతుంటే సుప్రీంకోర్టు మౌనంగా ఉండడం బాధాకరమన్నారు. బూటకపు ఎన్ కౌంటర్లను సుమోటోగా స్వీకరించి సమగ్ర విచారణ చేపట్టాలని కోరారు. మావోయిస్టులతో శాంతిచర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2026 మార్చి నాటికి మావోయిస్టులు లేకుండా చేస్తానని ప్రకటించిన కేంద్ర మంత్రి అమిత్ షా.. ముందుగా దేశంలో ఉన్న అవినీతిని, నిరుద్యోగాన్ని, పాకిస్తాన్ తీవ్రవాదాన్ని అంతం చేస్తామని సవాల్తీసుకోవాలని హితువు పలికారు.
ప్రశ్నిస్తే దాడులు చేస్తరా? : కోదండరామ్
కార్పొరేట్ శక్తులకు కేంద్రం మితిమిరిన లాభాలు కల్పిస్తున్నదని.. దీనిని ప్రశ్నిస్తే దాడులు చేస్తరా? అని ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. రాజ్యాంగానికి, చట్టానికి విరుద్ధంగా బూటకపు ఎన్ కౌంటర్లు చేసినందుకు అధికారులపై కేసు నమోదు చేయాలన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ.. మావోయిస్టులను చంపేస్తామనడం రాజ్యాంగానికి, చట్టానికి వ్యతిరేకమన్నారు. మనుషులను చంపే అధికారం కేంద్రానికి ఎవరిచ్చారని నిలదీశారు.
ప్రాణాలు తీసే అధికారం రాజ్యానికి లేదు: హరగోపాల్
చట్ట ప్రకారం ఒకరి ప్రాణాలు తీసే అధికారం రాజ్యానికి లేదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. బాధ్యతగల కేంద్ర మంత్రి మావోయిస్టులను చంపేస్తామనడం ఏ రాజ్య భాష అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అవుతారా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత కమ్యూనిస్టులు, ప్రజాతంత్ర వాదులు, ప్రజాస్వామిక వాదులు, పౌర సమాజంపైన ఉందన్నారు. హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ.. ఎన్ కౌంటర్ల తీరుపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. కేంద్రం టార్గెట్ పెట్టాల్సింది పేదరికం, అవినీతి, రైతుల ఆత్మహత్యలపైన అని హితవు పలికారు.
