వృద్ధురాలి మర్డర్‌‌‌‌‌‌‌‌ కేసు విచారణ.. వెలుగులోకి యువకుడి హత్య

వృద్ధురాలి మర్డర్‌‌‌‌‌‌‌‌ కేసు విచారణ.. వెలుగులోకి యువకుడి హత్య
  •     గతేడాది ఫిబ్రవరిలో ఘటన.. ఏడాదిన్నర తర్వాత వీడిన మిస్టరీ
  •     ఇటీవల వృద్ధురాలి హత్య కేసులో ఇద్దరిని అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేసిన పోలీసులు
  •     ఆందోళనకు గురై ఫ్రెండ్స్‌‌‌‌‌‌‌‌ వద్ద చెప్పుకున్న మిగతా నిందితులు
  •     మృతుడి ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌ ఫిర్యాదు..ఆరుగురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

కరీంనగర్, వెలుగు : కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా గంగాధరలో ఇటీవల జరిగిన ఓ వృద్ధురాలి హత్య కేసును ఎంక్వైరీ చేస్తున్న సమయంలో ఏడాదిన్నర కింద జరిగిన మరో మర్డర్‌‌‌‌‌‌‌‌ కేసు బయటపడింది. వృద్ధురాలిని హత్య చేసిన యువకులే.. గతేడాది ఫిబ్రవరిలో కొత్తపల్లి మండలం మల్కాపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన కవ్వంపల్లి దినేశ్‌‌‌‌‌‌‌‌ అనే యువకుడిని సైతం హత్య చేసినట్లు తేలింది. భూతగాదాలు, వ్యక్తిగత కక్షలతోనే యువకుడిని చంపేశారని పోలీసులు గుర్తించారు.

 కేసుకు సంబంధించిన వివరాలను సీపీ గౌష్‌‌‌‌‌‌‌‌ ఆలం శుక్రవారం వెల్లడించారు. కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా కొత్తపల్లి మండలం మల్కాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేశ్‌‌‌‌‌‌‌‌ (40)కు భూమి అమ్మకం విషయంలో దేవునూరి సతీశ్‌‌‌‌‌‌‌‌తో, ఓ మహిళ విషయంలో దేవునూరి సంతోష్‌‌‌‌‌‌‌‌తో గొడవలు జరిగాయి. ఈ విషయంపై సంతోశ్‌‌‌‌‌‌‌‌ను చంపుతానని దినేశ్‌‌‌‌‌‌‌‌ పలుమార్లు బెదిరించాడు. 

ఈ విషయాన్ని సంతోష్‌‌‌‌‌‌‌‌ తన అన్న దేవునూరి శ్రావణ్‌‌‌‌‌‌‌‌కు చెప్పాడు. దీంతో దినేశ్‌‌‌‌‌‌‌‌ను చంపాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే గతేడాది ఫిబ్రవరి 25న శ్రావణ్‌‌‌‌‌‌‌‌ వదిన చనిపోవడంతో అక్కడికి దినేశ్‌‌‌‌‌‌‌‌ సైతం వచ్చాడు. అదే రోజు సాయంత్రం మద్యం తాగుదామని దినేశ్‌‌‌‌‌‌‌‌ను దేవునూరి సతీశ్‌‌‌‌‌‌‌‌ బైక్‌‌‌‌‌‌‌‌పై కరీంనగర్‌‌‌‌‌‌‌‌ తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగిన తర్వాత ఇద్దరూ కలిసి మల్కాపూర్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చారు.

 అప్పటికే అక్కడ ఉన్న దేవునూరి శ్రావణ్, దేవునూరి రాకేశ్‌‌‌‌‌‌‌‌, దేవునూరి సంతోష్‌‌‌‌‌‌‌‌, జంగా చిన్నారెడ్డి, మోతె గ్రామానికి చెందిన కుమ్మరి వికేశ్‌‌‌‌‌‌‌‌ కలిసి దినేశ్‌‌‌‌‌‌‌‌ను చితకబాదారు. తర్వాత కారులో ఎక్కించి దినేశ్‌‌‌‌‌‌‌‌ కాళ్లు, చేతులు కట్టేసి చొప్పదండి శివారులోని కాల్వలో పడేశారు. దినేశ్‌‌‌‌‌‌‌‌కు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో అతడి మిస్సింగ్‌‌‌‌‌‌‌‌పై ఎలాంటి ఫిర్యాదు అందలేదు. దీంతో నిందితులు దర్జాగా బయట తిరిగారు.

నిందితుల భయమే పట్టించింది..

దేవునూరి సతీశ్‌‌‌‌‌‌‌‌, దేవనూరి శ్రావణ్‌‌‌‌‌‌‌‌ కలిసి ఇటీవల గంగాధరలో ఉండే పెగుడ మల్లవ్వ అనే వృద్ధురాలిని హత్య చేసి బంగారు ఆభరణాలను దోచుకున్నారు. తర్వాత డెడ్‌‌‌‌‌‌‌‌బాడీని చెత్తకుప్పలో పడేశారు. హత్య విషయం తెలుసుకున్న పోలీసులు సతీశ్‌‌‌‌‌‌‌‌, శ్రావణ్‌‌‌‌‌‌‌‌ను గుర్తించి అరెస్ట్‌‌‌‌‌‌‌‌ చేశారు. విచారణ టైంలో దినేశ్‌‌‌‌‌‌‌‌  హత్య విషయాన్ని చెబుతారేమోనని మిగతా నిందితులు ఆందోళనకు గురయ్యారు. 

ఇదే విషయాన్ని జంగా చిన్నారెడ్డి అనే యువకుడు తన సన్నిహితుల వద్ద చెప్పగా.. ఈ విషయం దినేశ్‌‌‌‌‌‌‌‌ ఫ్రెండ్‌‌‌‌‌‌‌‌కు తెలిసింది. దీంతో అతడు డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా డీజీపీకి ఫిర్యాదు చేశాడు. డీజీపీ ఆదేశాల మేరకు చొప్పదండి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో చొప్పదండి సీఐ, సిబ్బంది కలిసి మల్కాపూర్‌‌‌‌‌‌‌‌లోని దేవునూరి శ్రావణ్ ఇంటిపై దాడి చేసి అక్కడే ఉన్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు.

 విచారణలో నిందితులు హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. కారు, బైక్‌‌‌‌‌‌‌‌ను స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసి, రిమాండ్‌‌‌‌‌‌‌‌కు తరలించినట్లు సీపీ వెల్లడించారు. యువకుడి హత్య కేసు మిస్టరీని ఛేదించిన రూరల్ ఏసీపీ విజయకుమార్‌‌‌‌‌‌‌‌, చొప్పదండి సీఐ ప్రదీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌, కొత్తపల్లి సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సైలు నరేశ్‌‌‌‌‌‌‌‌రెడ్డి, వంశీకృష్ణ, రాజు, సాంబమూర్తి సిబ్బందిని సీపీ అభినందించారు.