నేతల సమన్వయ లోపంవల్లే బీసీ ఉద్యమాలు బలహీనం : బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్

నేతల సమన్వయ లోపంవల్లే బీసీ ఉద్యమాలు బలహీనం : బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్
  • త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తాం: బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్  

హైదరాబాద్ సిటీ, వెలుగు: స్థానిక సంస్థల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశం పరిష్కారం కావాల్సింది పార్లమెంట్ లోనే అని బీసీ జేఏసీ కో చైర్మన్ దాసు సురేశ్ తెలిపారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రైవేటు బిల్లు తీసుకువచ్చి కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్​చేశారు. శుక్రవారం బీసీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

 సీఎం రేవంత్ రెడ్డి కూడా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి పీఎంతో తో భేటీ అయ్యేలా అపాయింట్మెంట్ తీసుకోవాలని కోరారు. కాస్తంత సమన్వయంతో సాధ్యమయ్యే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై కేంద్రం రాజకీయం చేయడం తగదన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఫీల్డ్​లెవెల్​లో బలమైన ఆకాంక్ష ఉందని, కానీ, బీసీ లీడర్ల సమన్వయం లోపం వల్లే బీసీ వర్గాల అవకాశాలు క్షీణిస్తున్నాయన్నారు.

ఉమ్మడి లక్ష్యం మీద దృష్టి సాధించి పోరాడాల్సిన బీసీ సంఘాల నేతలు వ్యక్తిగత ప్రయోజనాలకు పరిమితమవుతూ ఎవరికివారుగా కార్యక్రమాలు చేపడుతూ బీసీ వాదాన్ని బలహీన పరుస్తున్నారన్నారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు.