స్వప్నలోక్ అగ్ని ప్రమాద మృతుల్లో ఐదుగురు ఓరుగల్లు వాసులే

స్వప్నలోక్ అగ్ని ప్రమాద మృతుల్లో ఐదుగురు ఓరుగల్లు వాసులే

వరంగల్‍, మహబూబాబాద్‍, నర్సంపేట, వెలుగు: నిండా 25 ఏండ్లు లేవు.. పనికి పోతే కానీ పూట గడవని కుటుంబాలు.. ఇంటికి ఆసరాగా ఉండేందుకని ఒకరు.. ఎస్సై అవ్వాలనే కలతో వచ్చి 
కుటుంబానికి భారం కావద్దని ఇంకొకరు.. చెల్లి, తమ్ముడిని ప్రయోజకులని చేసే బాధ్యతతో మరొకరు.. జాబులో చేరారు. కానీ సికింద్రాబాద్‍ స్వప్న లోక్‍ కాంప్లెక్స్‌‌లో గురువారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలను పోగొట్టుకున్నరు. ఆరుగురిలో ఐదుగురు ఉమ్మడి వరంగల్‍ వాళ్లే. చేతికి అందివచ్చిన బిడ్డలు.. నిర్జీవంగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. 

ఉమ్మడి వరంగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఐదుగురిలో ఏ ఒక్కరికీ పాతికేండ్లు నిండలేదు. వరంగల్‍ జిల్లా నర్సంపేట నియోజకవర్గానికి చెందిన ఉప్పల శివ (22), బానోతు శ్రావణి (22), వంగ వెన్నెల (22), మహబూబాబాద్‍ జిల్లాకు చెందిన అమరాజు ప్రశాంత్‍ (23), జాటోతు ప్రమీల (23).. బీటెక్‍/డిగ్రీలు పూర్తి చేశారు. కొంతకాలం క్రితం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన వీరు తల్లిదండ్రులకు ఆర్థికంగా భారం కావద్దని, ఉద్యోగాల కోసం ప్రిపేర్‍ అవుతూనే కాల్‍ సెంటర్లో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారు. వీరందరి కుటుంబాలు కూడా కూలి నాలి చేసుకొ ని బతికేవే. ఉప్పల శివ తండ్రి రాజు తాపీ మేస్త్రీ. వంగ వెన్నెల తల్లిదండ్రులు రవి, లక్ష్మి కూలి పనులకు వెళ్తారు. బానోతు శ్రావణి కుటుంబం.. ఊర్లో ఎలాంటి ఆధారం లేక హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వలస వచ్చి జీవిస్తున్నది. అమరాజు ప్రశాంత్‍ తండ్రి జనార్దన్‍, జాటోతు ప్రమీల తండ్రి భద్రు తమ ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటున్నారు. బాధిత కుటుంబా లను ఆదుకుంటామని జిల్లాకు చెందిన మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍ హామీ ఇచ్చారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో ముగ్గురు బాధితులకు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి వ్యక్తిగతంగా రూ.50 వేల చొప్పున సాయం అందజేశారు. మరో వైపు మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్​గ్రేషియాను ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు.

అంత్యక్రియలు పూర్తి

ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఐదుగురు బాధితుల మృతదేహాలకు కుటుంబ సభ్యులు శుక్రవారం రాత్రి అంత్యక్రియలు నిర్వహించారు. డెడ్‌బాడీలకు మధ్యాహ్నానికి పోస్టుమార్టం పూర్తి కాగా.. సాయంత్రానికి వరంగల్, మహబూబాబాద్‌లోని సొంత గ్రామాలకు చేరుకున్నాయి. బంధువులు, పెద్ద ఎత్తున తరలివచ్చారు. నర్సంపేట పరిధిలో అంత్యక్రియలు పూర్తయ్యేసరికి రాత్రి 10 గంటలు దాటింది.

రెండేండ్ల నుంచి కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పని చేస్తూ.. 

నర్సంపేట మండలం చంద్రయ్యపల్లెకు చెందిన ఉప్పల రాజు, రజిత దం పతులకు కొడుకు, బిడ్డ. రాజు తాపీ మేస్ర్తీగా పని చేస్తూ పిల్లలను చదివించాడు. డిగ్రీ చదివిన కొడుకు ఉప్పల శివ.. ఇంట్లో ఆసరాగా ఉండేందుకు జాబ్‍ చేసేందుకు హైదరాబాద్ వచ్చాడు. రెండేండ్ల నుంచి కాల్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తూ ప్రతినెలా ఇంటికి డబ్బులు పంపిస్తున్నాడు. ఇంతలోనే చనిపోయాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

కుటుంబమంతా వలస వచ్చి..

ఖానాపురం మండలం టేకులతండాకు చెందిన బానోతు నర్సింహ, పద్మ దంపతులకు ఇద్దరు బిడ్డ లు, ఓ కొడుకు. అక్కడ కూలీ పనులు దొరక్కపోవడంతో బతుకుదెరువు కోసం ఆరేండ్ల క్రితమే 
హైదరాబాద్ వలస వచ్చారు. పెద్దకూతురు శ్రావణి  బీటెక్ చదువుకుంది. రెండేండ్ల కిందటే ప్రైవేట్ జాబ్ వచ్చింది. సొంతూరు వదిలి వలస వచ్చిన కుటుంబానికి బిడ్డగా శ్రావణి అండగా నిలిచింది. మిగతా ఇద్దరిని ప్రయోజకులుగా చేసే బాధ్యత తీసుకుంది. కానీ ఘోర ప్రమాదంలో శ్రావణి చనిపోవడంతో టేకులతండాలో విషాదం అలుముకుంది.

కుటుంబానికి అండగా ఉంటుందనుకుంటే.. 

మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం ఎర్రగుంట్ల తండా శివారు సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన జాటోత్ బద్రు, బుజ్జిల కూతురు ప్రమీల  చిన్నతనం నుంచే చదువుల్లో చురుకుగా ఉండేది. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ పిల్లలను చదివించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్‍ అవుతూనే 2021లో హైదరాబాద్‍లో పార్ట్ టైం జాబ్‍లో చేరింది. కుటుంబానికి అండగా ఉంటుందని అనుకుంటే.. అర్ధంతరంగా తనువు చాలించిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.

కష్టపడి చదువుకొని..

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం సుర్దేప ల్లికి చెందిన కుంచం రామారావు, ఎల్లమ్మ దం పతులకు ఇద్దరు కూమార్తెలు. రామారావు ఆటో డ్రైవర్. తల్లి ఎల్లమ్మ కూలి పనులు చేస్తూ ఇద్దరి పిల్లలను చదివించారు. కష్టపడి చదువుకున్న పెద్ద కూతురు త్రివేణి.. 6 నెలల కిందట హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. చిన్న కూతురు మమత కూడా సికింద్రాబాద్​లో త్రివేణి దగ్గరే ఉంటూ నర్సింగ్ చదువుకుంటున్నది. ప్రమాద సమయంలో మమత బయట ఉండి ప్రాణాలతో బయటపడింది. కూతుర్లనే కొడుకుల్లా చూసుకుంటారని ఆశపడ్డామని, త్రివేణి తమను విడిచి వెళ్లిపోయిందని తల్లిదండ్రులు రోదించారు.

షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం: అగ్నిమాపక శాఖ డీజీ నాగిరెడ్డి

సికింద్రాబాద్‌లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్ని ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే ప్రధాన కారణంగా భావిస్తున్నామని అగ్ని మాపక శాఖ డీజీ నాగిరెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనలో 5, 7 అంతస్తుల్లో ఉన్న దుకాణాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయని చెప్పారు. సమాచారం అందిన వెంటనే 15 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటల్ని అదుపులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

బిల్డింగ్ లోపల చిక్కుకుపోయిన 12 మందిని రక్షించామన్నారు. స్వప్నలోక్ బిల్డింగ్ యజమానులకు ఫైర్ సేఫ్టీ పెట్టుకోమని చెప్పామని, అయినా వారు నిర్లక్ష్యం చేశారని చెప్పారు. ఘటనలో షాపు కీపర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. బిల్డింగ్‌లో ఉన్న అగ్నిమాపక పరికరాలు పని చేసే స్థితిలో లేవని, బయటకు వెళ్లే మెట్ల దారి తలుపులు లాక్​చేశారని, దీంతో ప్రమాదంలో చిక్కుకున్న వారిని బయటకు తెచ్చేందుకు వాటిని పగులగొట్టాల్సి వచ్చిందన్నారు. 

రేకుల షెడ్డులో ఉంటూనే చదివించిన్రు

దుగ్గొండి మండలం మర్రిపల్లెకు చెందిన వంగ రవి, లక్ష్మి దంపతులకు బిడ్డ, కొడుకు ఉన్నారు. తల్లిదండ్రులిద్దరూ కూలి పనులకు వెళ్తుంటారు. తమ లెక్క పిల్లలు కష్టపడొద్దని.. రేకుల షెడ్డు లాంటి ఇంట్లో ఉంటూనే ఇద్దరినీ కష్టపడి చదివించారు. డిగ్రీ చదవిన బిడ్డ వంగ వెన్నెల ఇంట్లో వాళ్లకు చేయూతగా ఉండేందుకు జాబ్‍ కోసం హైదరాబాద్ వచ్చింది. రెండేండ్ల నుంచి ప్రైవేటు జాబ్ చేస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంది. వెన్నెలకు పెండ్లి చేద్దామని ఈ మధ్యనే తల్లిదండ్రులు అనుకున్నారు. అగ్ని ప్రమాదంలో బిడ్డ చనిపోవడంతో వారి ఆశలన్నీ ఆవిరయ్యాయి.


ఎస్సై అవ్వాలనే లక్ష్యంతో సిటీకి వచ్చి..

కేసముద్రం మండలం ఇంటికన్నే గ్రామానికి చెందిన అమరాజు ప్రశాంత్.. డిగ్రీ పూర్తి చేశాడు. ఎస్సై అవ్వాలనే లక్ష్యంతో ఉండేవాడు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతూనే.. ఆర్మీకి ప్రిపేరయ్యే యువకులకు ఫిజికల్ ఈవెంట్లపై శిక్షణ ఇచ్చేవాడు. ఉద్యోగం వచ్చే వరకు కుటుంబానికి భారం కావొద్దని.. ఆరు నెలల కిందట హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాల్‍ సెంటర్‍ జాబ్‍లో చేరాడు. ప్రమాదంలో ప్రశాంత్‍ చనిపోవడంతో.. తల్లిదండ్రులు, స్నేహితులు.. అతని వద్ద శిక్షణ పొందిన స్టూడెంట్లు జీర్ణించుకోలేకపోతున్నారు.